విజయవాడ : నారెడ్కో ప్రాపర్టీ షో అన్ని వర్గాల ప్రజల ఆదరణను చూరగొనటం
ముదావహామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిఎం మనీష్ కుమార్ సింగ్ అన్నారు.
నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని అంశాలను ఒకే వేదిక పైకి తీసుకు రావడంలో
నారెడ్కో ప్రతినిధులు సఫలం అయ్యారన్నారు. గత మూడు రోజులుగా నగరంలోని ఏ
కన్వెన్షన్ సెంటర్ నిర్వహిస్తున్న జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి ప్రాపర్టీ
షో ఆదివారం ముగిసింది. ముగింపు సమావేశంలో సింగ్ మాట్లాడుతూ ఈ ప్రదర్శన
స్థిరాస్తి రంగం ఊపందుకోవటానికి సహకరించిందని తెలిపారు. నారెడ్కో సెంట్రల్
జోన్ అధ్యక్ష, కార్యదర్శులు ముక్తేశ్వర రావు, పీవి కృష్ణ మాట్లాడుతూ దాదాపు
నాలుగువేల ఐదు వందల మంది కొనుగోలు దారులు ఈ ప్రదర్శనను సందర్శించారన్నారు.
నారెడ్కో రాష్ట్ర కార్యదర్శి పరుచూరి కిరణ్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
ఉపాధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు, క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ రావు
తదితరులు మాట్లాడుతూ మధ్యతరగతి మొదలు ఉన్నత వర్గాల వరకు అందరికీ అందుబాటు
నిర్మాణాల సమాచారం ఇక్కడ అందించగలిగామన్నారు. టైటిల్ స్పాన్సరర్ గా
వ్యవహరిస్తున్న ఎస్ఎల్వి బిల్డర్స్, డవలపర్స్ ఎండి శ్రీనివాస రాజు మాట్లాడుతూ
కరోనా తరువాత నగరం వేదికగా ఏర్పాటు అయిన అతి పెద్ద ప్రాపర్టీ షో ఇదేనన్నారు.
గృహాలను కొనుగోలు చేయాలనుకునే వారితో పాటు, బిల్డర్లు, డెవలపర్లు, హౌసింగ్
ఫైనాన్స్ సంస్థలు, రియల్టీ కన్సల్టెంట్లు, తయారీదారులు, ఉత్పత్తి సరఫరాదారులు,
ఇంటీరియర్ డెకరేటర్లు, ఆర్కిటెక్ట్లు, పరిశ్రమ నిపుణులు, విశ్లేషకులు ఈ
ప్రదర్శనలో పాల్గొన్నారు. కొనుగోలు దారులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వటం షో లో
ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ లో
నారెడ్కో ప్రత్యేకంగా తయారు చేయించిన వస్త్ర సంచులను ఆవిష్కరించి ఆహూతులకు
ఉచితంగా పంపిణీ చేశారు. ప్రాపర్టీ షో ఛైర్మెన్ సందీప్ మండవ, నారెడ్కో
ప్రతినిధులు వాసిరెడ్డి వంశీ కృష్ణ, సుధీర్, మద్దుల గణేష్ కుమార్, విజయ
కుమార్, కొడే జగన్, పొట్టి రామకృష్ణ, కోనేరు రాజా, రామినేని శ్రీనివాస్, వేణు
మాధవ్ తదితరులు పాల్గొన్నారు.