బీజింగ్ : చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలో భూగర్భంలోకి లోతైన రంధ్రం
తవ్వకాన్ని ఆ దేశ శాస్త్రవేత్తలుమొదలుపెట్టారు. దీంతో భూగర్భాన్వేషణలో కీలక
ముందడుగు పడినట్లయింది. సుమారు 10 వేల మీటర్ల లోతు వరకు ఈ రంధ్రాన్ని
తవ్వుతారని అంచనా. భూమి అడుగున దాదాపు 10 రాతి పొరలను చీల్చుకుంటూ ఈ ప్రక్రియ
సాగనుంది. దాదాపు 14.5 కోట్ల ఏళ్ల వయసున్న క్రెటెషియస్ పొరను చైనా
శాస్త్రవేత్తలు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఖనిజ సంపద, ఇంధన వనరులను
గుర్తించడంతో పాటు భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటం ముప్పును ముందే
పసిగట్టేందుకు వారి కృషి దోహదపడనుంది. ఇప్పటివరకు ప్రపంచంలో మానవులు తవ్విన
అత్యంత లోతైన రంధ్రం రష్యాలో ఉంది. కోలా సూపర్ డీప్ బోర్హోల్గా దీన్ని
వ్యవహరిస్తారు. దాని లోతు 12,262 మీటర్లు. 20 ఏళ్లపాటు బోర్ వేయగా 1989లో ఆ
లోతుకు శాస్త్రవేత్తలు చేరుకోగలిగారు.