ప్రజలు, న్యాయవాదుల సంఘాలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదు
న్యాయవాదులు నిరసన కార్యక్రమాలను విరమించి విధులకు హాజరవ్వాలి
భూ యాజమాన్య హక్కులకు పటిష్టమైన భరోసా కల్పించేందుకే ఈ చట్టాన్ని రూపొందించాం
సమగ్ర భూ సర్వే ద్వారా అన్నిరెవిన్యూ రికార్డులు అప్డేషన్ తదుపరే ఈ చట్టాన్ని అమలుపరుస్తాం
శాటిలైట్ నిరంతరం అనుసంధానంతో అత్యుత్తమ సాంకేతిక విధానంలో ఈ సమగ్ర సర్వే అమలు
రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు & స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వెలగపూడి : రాష్ట్రంలో రూపొందించిన భూ హక్కు చట్టానికి అన్ని వర్గాల అభిప్రాయాలను క్రోడీకరిస్తూ మరింత పటిష్టగా రూపొందిస్తామని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు పేర్కొన్నారు. రెవిన్యూ రికార్డుల అప్డేషన్ తదుపరే ఈ చట్టం రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందని, ఈ చట్టం విషయంలో ప్రజలు, న్యాయవాదుల సంఘాలు ఏమాత్రము ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. న్యాయవాదులు తమ నిరసన కార్యక్రమాలను విరమించి తమ విధులకు హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం వెలగపూడి సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భూ హక్కు చట్టం రూపొందించేందుకు ముందు దేశంలో జరిగిన సంఘటనలు, వాటి పూర్వాపరాలను వివరించారు. దేశంలో భూ హక్కులకు భరోసా కల్పించాలనే ప్రయత్నం 1989 లో మొట్ట మొదటిసారిగా ప్రారంభం అయిందన్నారు. దేశంలో భూమి రికార్డులను అధ్యయనం చేసి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో నివేదిక అందజేయాలని అప్పటి ప్లానింగ్ కమిషన్ ప్రొఫెసర్ డి.సి.వాద్యా ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ను కేంద్రం నియమించిందన్నారు. ఈ కమిషన్ దేశ మంతా పర్యటించి భూ రికార్డులను అధ్యయనం చేసి 1990 లో ఒక ప్రాథమిక నివేదికను కేంద్రానికి అందజేసిందన్నారు. దేశంలో ఇప్పుడున్న రికార్డుల వ్యవస్థ స్థానంలో భూమి హక్కులకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ప్రవేశపెట్టాలని ఆ ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసిందన్నారు. రెవిన్యూ రికార్డుకి గ్యారంటీ లేక పోవడం వల్లే దేశంలో భూవివాదాలు పెరుగుతున్నాయని, గ్యారంటీ ఇస్తే భూ వివాదాలు తగ్గడమే కాకుండా దేశంలో పెట్టుబడులు పెరిగి ఆర్థికాభివృద్ది వేగవంతం అవుతుందని ఆ నివేదిలో స్పష్టం చేయడం జరిగిందన్నారు.
దేశంలోని సివిల్ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల్లో 66 శాతం కేసులు భూ వివాదాలకు సంబందించినవే అని, అందులోకూడా 93 శాతం కేసులు లక్షలోపు ఆదాయం ఉన్న వ్యక్తులకు సంబంధించినవే అని తెలిపారు. ఇందు కోసం వారు ఏటా రూ.27 వేల కోట్లను వెచ్చిస్తున్నట్లు ఒక అధ్యయనంలో తేలిందన్నారు. రికార్డుల ప్రకారం 14 శాతం హత్యలు, 60 శాతం నేరాలు భూ వివాదాల వల్లే జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. 2024 నాటికి దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవడమే లక్ష్యంగా పనిచేయాలని కేంద్రం నిర్థేశించిందన్నారు. అందుకై 2019 లో ముసాయిదా చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఆ ముసాయిదా చట్టం ప్రకారం టైటిల్ గ్యారెంటీ చట్టం ఏ విధంగా రూపొందించాలో తెలియజేస్తూ 2019 లోనే నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను కమ్యునికేట్ చేయడం జరిగిందన్నారు. నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం మన రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దేశంలోనే ప్రప్రధమంగా పటిష్టమైన భూ హక్కు చట్టాన్ని రూపొందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. భూ యాజమాన్య హక్కులకు పటిష్టమైన భరోసా కల్పించేందుకే ఈ చట్టం రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రూపొందించిన ఈ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని ఆదర్శంగా తీసుకుని ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి ఎనిమిది పెద్ద రాష్ట్రాలు ఈ చట్టాన్ని రూపొందిస్తున్నాయన్నారు. ఇప్పటికే 175 దేశాల్లో నిశ్చయాత్మక యాజమాన్య హక్కు విధానాన్ని అమలు పరుస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ చట్టం అమల్లో భాగంగా ఇప్పటికే జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా భూముల సమగ్ర సర్వే, భూ రికార్డుల అప్డేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జిరిగిందన్నారు. శాటిలైట్ నిరంతరం అనుసంధానంతో అత్యుత్తమ సాంకేతిక విధానాన్ని ఈ సమగ్ర సర్వే కార్యక్రమం అమలుకు జోడించడమైందన్నారు. దశలవారీగా మొత్తం 17 వేల గ్రామాల్లో ఈ సమగ్ర సర్వే కార్యక్రమం నిర్వహించడం జరుగుచున్నదని, వాటిలో ఇప్పటి వరకూ 4 వేల గ్రామాల్లో సమగ్ర సర్వే కార్యక్రమం పూర్తయిందన్నారు. మిగిలిన 13 వేల గ్రామాల్లో కూడా ఈ సమగ్ర సర్వే కార్యక్రమాన్ని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసి రెవిన్యూ రికార్డుల అప్డేషన్ ను త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సమగ్ర సర్వే విధానాన్ని దేశంలోని పలు రాష్ట్రాలు కూడా అనుసరించేందుకు చర్యలు చేపట్టాయన్నారు. ఈ సమగ్ర సర్వే ద్వారా వివాదాలకు ఆస్కారం లేని రెవిన్యూ రికార్డుల అప్డేషన్ జరుగుచున్నదన్నారు. ఈ రెవిన్యూ రికార్డుల అప్డేషన్ తదుపరే రాష్ట్రంలో భూ హక్కు చట్టాన్ని దశల వారీగా అమలుకు నోటిపై చేయడం జరుగుతుందన్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ చట్టానికి నియమ నిబందనలనే రూపొందించలేదని, ఫలితంగా వచ్చే ఆరుఏడు మాసాల్లో ఈ చట్టం అమలుకు అవకాశాలు లేవన్నారు. అయితే ఈ భూ హక్కు చట్టంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పలు రిట్లు ఫైల్ అవ్వడమే కాకుండా పలువురు పౌరులు, స్టేక్ హోల్డర్లు, న్యాయ వాద సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయన్నారు.