భైంసా: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాసంగ్రామ
యాత్రలో భాగంగా భైంసాలో జరిగిన బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భైంసాకు
రావాలంటే పర్మిషన్ తీసుకోవాలా అని బండి ప్రశ్నించారు. మనం ఏ రాష్ట్రం, ఏ
దేశంలో ఉన్నామని ప్రశ్నలు సంధించారు. భైంసాకు భరోసా కల్పించాడానికే
ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎగిరేది
కాషాయ జెండానే అని విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే భైంసాను దత్తత
తీసుకుంటామన్నారు. హిందూ వాహిని కార్యకర్తలపై పెట్టిన పీడీయాక్ట్‌లు
కొట్టేస్తామన్నారు. వారికి ఉద్యోగాలిచ్చి గౌరవించుకుంటామని చెప్పారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన 5 లక్షల కోట్ల రూపాయలు
ఏమయ్యాయని బండి ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎంఐఎం నాయకులు
ఎక్కడికైనా వెళ్లొచ్చు కానీ, దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే బీజేపీ నేతలపై
ఆంక్షలు విధిస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజాసంగ్రామ యాత్రకు
హైకోర్టు అనుమతి లభించాక బండి సంజయ్ నిన్న అడెల్లి పోచమ్మ అమ్మవారి ఆశీర్వాదం
తీసుకొని పాదయాత్ర ప్రారంభించారు. బండి సంజయ్ డిసెంబర్ 16 వరకూ తలపెట్టిన 5వ
విడత యాత్ర కు అనుమతినిచ్చిన రాష్ట్ర హైకోర్ట్ భైంసా పట్టణానికి 3 కిలోమీటలర్ల
దూరంలో సభ నిర్వహిస్తేనే అనుమతిస్తామని షరతులు విధించింది. భైంసా పట్టణంలోకి
వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. 500 మందితో
మాత్రమే పాదయాత్ర చేయాలని, 3 వేల మందితో సభ జరుపుకోవాలని హైకోర్టు
ఆదేశాలిచ్చింది. సభకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
మాత్రమే అనుమతినిచ్చింది. వాస్తవానికి ప్రజాసంగ్రామ యాత్రకు నిర్మల్ జిల్లా
పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. భైంసాలో
సున్నితమైన పరిస్థితుల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
బహిరంగసభతో పాటు యాత్రకు కూడా భద్రత ఇవ్వలేమన్నారు.
హైకోర్టులో బీజేపీ తరపున రామచందర్ రావు వాదనలు వినిపించారు. బైంసా లోపలి నుంచి
పాదయాత్ర వెళ్ళదని కోర్టుకు తెలిపారు. రూట్ మ్యాప్ వివరాలు కోర్టుకు
సమర్పించారు. బైంసా వై జంక్షన్ నుంచి పాదయాత్ర వెళ్తుందన్నారు. బైంసా టౌన్
లోకి పాదయాత్ర ఎంటర్ కాదని స్పష్టం చేశారు. బైంసా టౌన్ లోకి ఎంటర్ కానప్పుడు
ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. బైంసా చాలా సున్నితమైన
ప్రాంతమని ఏజీ బిఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం
కలిగే అవకాశం ఉందన్నారు. అయితే వాదనలు విన్న అనంతరం హైకోర్టు షరతులతో
అనుమతినిచ్చింది.
ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఇప్పటివరకూ 4 విడతల్లో 21
జిల్లాల్లోని 1178 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశారు. ఐదో విడత పాదయాత్ర
కరీంనగర్లో ముగించాలనుకున్నారు