31న మంగళగిరిలో సామాజిక సాధికార యాత్ర మహాసభ
సమసమాజ స్థాపనే సామాజిక సాధికార యాత్ర ఉద్దేశం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏనాడో చనిపోయింది
ఆ పార్టీని ఏపీ ప్రజలు ఎప్పటికీ క్షమించరు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మద్దత్తుతో మరోమారు సీఎంగా జగన్మోహన్ రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
గుంటూరు : గడిచిన చరిత్ర పరిశీలిస్తే మంగళగిరిలో గత రెండు దఫాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవి తప్పక విజయం సాధిస్తారని, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 31న మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ నియోజక వర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన ధాఖలాలు ఎక్కడా లేవని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి నారా లోకేష్ ఓటమి తధ్యమని అన్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెనుకబడిన సామాజిక వర్గానికి (చేనేత సామాజిక వర్గం) చెందిన వ్యక్తి పోటీలో నిలుబడుతున్నారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వడం లేదన్నది నగ్న సత్యమని అన్నారు. నియోజక వర్గంలో బీసీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటారని, అలాగే రాబోయే ఎన్నికల్లో ఆయా వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మరోమారు ముఖ్యమంత్రి చేస్తారని బలంగా నమ్ముతున్నామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో లబ్దిపొంది ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రెండు నెలల క్రితం సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించామని, రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల్లో సాధికార యాత్రలు జరుగుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 31న మంగళగిరిలో మిద్దే సెంటర్ లో సామాజిక సాధికార యాత్ర మహాసభ జరుగుతుందని అన్నారు. సభకు ముందు పెద్ద ఎత్తున పాదయాత్రగా కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాలు, దళిత సోదర సోదరీమణులు పాల్గొని మహాసభను విజయవంతం చేయనున్నారని అన్నారు. సమసమాజ స్థాపనే సాధికార యాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. శతాబ్దాలుగా అణగదొక్కబడిన బడుగు,బలహీన వర్గాలను ఇతర సామాజిక వర్గాలకు ధీటుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారని అన్నారు. ఆయా పథకాలు, కార్యక్రమాల ద్వారా చేస్తున్న లబ్దిని ప్రజలకు తెలియజేసేందుకే ఈ సామాజిక సాధికార యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనాడో చనిపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అడ్డుగోలుగా విడదీసి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని అన్నారు. ఏపీలో రాబోయే తరాలకు సైతం ఆ పార్టీ తీరని ద్రోహం చేసిందని అన్నారు. ఆ పార్టీ ఏపీకి చేసిన ద్రోహాన్ని ఇక్కడి ప్రజలు ఎప్పటికీ క్షమించరని, కాంగ్రెస్ పార్టీ చరిత్రపుటల్లో కలిసిపోయిందని అన్నారు.
ఈ బస్సుయాత్ర ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ,
మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ పరిశీలకుడు రాపాక శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలసి విజయసాయిరెడ్డి పరిశీలించారు.