అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
నంద్యాల : జిల్లా సమగ్రాభివృద్ధిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యం
కావాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు.
మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్
కి జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్, జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి.,
ఇతర ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం
కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పలు అభివృద్ధి కార్యక్రమాలపై
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉమ్మడి జిల్లా
పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా
బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర
కిషోర్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు
ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తదితరులు
పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ అన్ని
నియోజకవర్గాల్లో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులను
త్వరగా పూర్తి చేసి జిల్లా సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలని
అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని అన్ని నియోజకవర్గాలను
అభివృద్ధి పథం వైపు నడిపించాలని మంత్రి సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, ఉపాధి,
విద్యుత్, పంచాయితీ రాజ్, గృహ నిర్మాణాలు, అలాగే మున్సిపల్ పరిధిలో పట్టణ
అభివృద్ధి, సుందరీకరణ, పార్కులు, క్రీడా మైదానం ఏర్పాటు తదితర అభివృద్ధి
పనులలో ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. ఆయా శాఖల
అధికారులందరూ బాధ్యతాయుతంగా పనిచేసి నిర్ణీత కాల పరిమతిలోగా పూర్తి చేయాలని
సంబంధిత అధికారులను ఆదేశించారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మంజూరైన
పనులన్నింటిని త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
గడపగడపకు ప్రభుత్వంలో చేపట్టిన పనులకు కూడా త్వరితగతిన బిల్లులు చెల్లింపు
అవుతున్నాయని, పనుల నాణ్యతలో ఎక్కడ రాజీపడరాదని మంత్రి సూచించారు. రైతు భరోసా
కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించడంతో పాటు
వైయస్సార్ యంత్ర పరికరాలను రైతులకు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని
మంత్రి ఆదేశించారు. రైతులకు అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలు
అందజేసేలా కృషి చేయాలన్నారు. ఉపాధి హామీకి సంబంధించి లక్ష్యం మేరకు లేబర్
రిపోర్టింగ్ ను పెంచి ఎప్పటికప్పుడు బిల్స్ అప్లోడ్ చేయాలన్నారు.
జగనన్న సురక్ష కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం నిర్దేశించిన
11 రకాల ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం లేకుండా, లంచాలకు తావు లేకుండా
పారదర్శకంగా ప్రజలకు అందజేయాలని సూచించారు. జగనన్న సురక్ష కార్యక్రమం నిమిత్తం
గ్రామాలకు వెళ్ళినప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాలని
మంత్రి పేర్కొన్నారు. జగనన్న లేఔట్లలో గడువులోగా గృహ నిర్మాణాలు పూర్తి
చేయడంతో పాటు విద్యుదీకరణ, త్రాగునీటి సరఫరా ఇతర మౌలిక వసతులను ఏర్పాటు
చేయాలన్నారు. గృహ నిర్మాణానికి స్టేజిల వారీగా బిల్లులు చెల్లింపు అయ్యేలా
కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా
చూడాలన్నారు. ప్రాధాన్యతాభవన నిర్మాణాల పనులను త్వరగా పూర్తి చేయాలని
పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రెవెన్యూ
అధికారి పుల్లయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.