తమిళనాడు గవర్నర్ అసాధారణ చర్య
న్యాయపరంగా ఎదుర్కొంటాం : ముఖ్యమంత్రి స్టాలిన్
చెన్నై: తమిళనాడులో గవర్నర్‌కు, డీఎంకే ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే
భగ్గుమనే పరిస్థితి ఇప్పటికే ఉండగా దానికి మరింత ఆజ్యం పోసే పరిణామం తాజాగా
చోటు చేసుకుంది. రాష్ట్ర మంత్రివర్గం నుంచి సెంథిల్ బాలాజీని తొలగిస్తూ
గవర్నర్ ఆర్.ఎన్.రవి అనూహ్యంగా ఉత్తర్వులు జారీ చేయడం కొత్త వివాదానికి
హేతువైంది. అంతలోనే అటార్నీ జనరల్‌తో సంప్రదింపుల కోసమంటూ గవర్నర్ ఆ
ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అన్నాడీఎంకే హయాంలో ఉద్యోగాలు
ఇప్పిస్తానని నగదు తీసుకుని మోసం చేసిన కేసులో ఇటీవల మంత్రి సెంథిల్ బాలాజీ
నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు
సోదాలు చేసి ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు నేరాలతో
సంబంధం ఉన్నందున ఆయనకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో
ప్రస్తుతం ఎటువంటి శాఖ లేని సెంథిల్ బాలాజీని మంత్రి మండలి నుంచి తొలగిస్తూ
గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
చివరకు అటార్నీ జనరల్‌తో ఈ అంశాన్ని సంప్రదించి తుది నిర్ణయం తీసుకునేందుకు
వీలుగా ఆ ఉత్తర్వులను నిలుపుదల చేసినట్లు గవర్నర్ కార్యాలయ వర్గాలు రాత్రి
వెల్లడించాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌కు తెలియజేశాయి.
ఖండించిన విపక్షాలు : అంతకుముందు గవర్నర్ అసాధారణ చర్యపై ముఖ్యమంత్రి
ఎం.కె.స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఓ మంత్రిని కేబినెట్‌ను తొలగించే
అధికారం గవర్నర్‌కు లేదన్నారు. ఈ అంశాన్ని తమ ప్రభుత్వం న్యాయపరంగా
ఎదుర్కొంటుందని ప్రకటించారు. మంత్రిని తొలగించడాన్ని బీజేపీయేతర ప్రతిపక్షాలు
ఖండించాయి. ‘ఈ చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని
హతమార్చడమే’ అని అభివర్ణించాయి.