భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
పీసీసీ కమిటీల్లో చోటు దక్కకపోవడంపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ : ఎన్నికలకు నెలముందు వరకు రాజకీయాలపై ఏమీ మాట్లాడనని భువనగిరి ఎంపీ
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో నల్గొండ నుంచే ఎమ్మెల్యేగా
పోటీచేస్తానని తెలిపారు. నల్గొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల,
గజ్వేల్ తరహాలో నల్గొండలో ఎందుకు 20వేల ఇళ్లు కట్టేలేదని రాష్ట్ర
ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నల్గొండ పట్టణంలో అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు
కూల్చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో 2023 శాసనసభ ఎన్నికలే
లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారీ కార్యవర్గాన్ని తాజాగా ప్రకటించింది.
రాష్ట్ర వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే పీఏసీ, పీఈసీల్లో ప్రజా ప్రతినిధులకు
చోటు కల్పించిన అధిష్ఠానం ఆ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చోటు
కల్పించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఆదివారం కోమటిరెడ్డిని
ప్రశ్నించగా ‘‘ప్రస్తుతం కాంగ్రెస్ కండువా ఉంది. మిగతా సంగతి తర్వాత
ఆలోచిద్దాం. ఎన్నికలకు నెలముందు వరకు రాజకీయాలపై మాట్లాడను. మంత్రి పదవినే
వదిలేశా. పార్టీ పదవులు నాకో లెక్కనా?’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
వ్యాఖ్యానించారు.
మునుగోడు ఉప ఎన్నికలో వ్యవహరించిన తీరుతోనే ఆయనకు కాంగ్రెస్ పార్టీ తాజాగా
ప్రకటించిన కమిటీల్లో కోమటిరెడ్డికి స్థానం దక్కలేదని ప్రచారం సాగుతోంది.
పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటూ సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం
కోసం పరోక్షంగా పనిచేశారనే ఆరోపణలతో రెండు సార్లు ఇప్పటికే పార్టీ జాతీయ కమిటీ
నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఇటీవల తిరుమల పర్యటనలో మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు,
ఎన్నికలకు నెల ముందు తన అభిప్రాయం వ్యక్తం చేస్తానని చెప్పడంతో కాంగ్రెస్
పార్టీ అధిష్ఠానం ఆయనను దూరం పెట్టినట్లు తెలుస్తోంది.
పీసీసీ కమిటీల్లో చోటు దక్కకపోవడంపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ నుంచే ఎమ్మెల్యేగా పోటీచేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి
వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలకు నెల ముందు వరకు రాజకీయాల గురించి
మాట్లాడనని తెలిపారు. తెలంగాణ కోసం మంత్రి పదవినే వదిలేశానని, పార్టీ పదవులు
ఎంత అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో హైపవర్ కమిటీలు చాలా ఉన్నాయన్నారు. తనకు
పదవులు ముఖ్యం కాదని, కార్యకర్తలే ముఖ్యమన్నారు. కాగా తెలంగాణ పీసీసీకి చెందిన
కొత్త కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి
చైర్మన్‌గా 40 మందితో పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, మాణిక్యం ఠాకూర్ అధ్యక్షతన
20 మంది సభ్యులతో రాజకీయ వ్యవహారాల కమిటీలను విడుదల చేసింది. ఈమేరకు ఏఐసీసీ
ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. ఈ కమిటీల్లో
కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఎలాంటి పదవి దక్కలేదు. పీసీసీ స్టార్
క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రెండు కమిటీల్లోనూ చోటు
దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిప్‌గా మారింది. ఈ విషయమై ఆదివారం
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
కొన్నాళ్లుగా పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారశైలి చర్చనీయాంశంగా
మారింది. కొంతకాలంగా పార్టీకి అంటిముట్టనట్టుగా ఉండటం, మునుగోడు ఉప ఎన్నిక
సమయంలో ప్రచారానికి దూరంగా ఉండటం నేపథ్యంలో వెంకట్ రెడ్డికి కొత్త కమిటీల్లో
చోటు దక్కలేదని తెలుస్తోంది. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర
ఆరోపణలు చేయడం కూడా కారణమనే చర్చ జరుగుతోంది.