అంగన్ వాడీల సమస్యపై రెండు దఫాల చర్చ
పండగ పూట అమ్మల సమస్య తీర్చాలని వినతి
సీఎం దృష్టికి తెస్తామన్న మంత్రి బొత్స సత్యనారాయణ
విజయవాడ : దీర్ఘకాలంగా నడుస్తున్న అంగన్వాడీల సమ్మె పరిష్కారానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవ చూపాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కోరారు. విజయవాడలో శనివారం ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీల కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న అనంతరం జేడీ నేరుగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణకు సెల్ ఫోనో కాల్ చేసి మాట్లాడారు. సంక్రాతి పండుగ పూట అమ్మలు ధర్నా చౌక్ లో అలమటిస్తూ, ఉద్యమిస్తున్నారని జేడీ తన ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్ వాడీల న్యాయపరమైన కోర్కెలను వెంటనే తీరుస్తూ, పెంచిన జీతాల జీవోని తక్షణం విడుదల చేయాలని ఆయన మంత్రి బొత్స సత్యన్నారాయణను కోరారు. అవసరం అయితే, తాను నేరుగా సీఎంను కలిసి, ఈ సమస్యపై చర్చిస్తానని జేడీ లక్ష్మీనారాయణ మంత్రికి స్పష్టం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, తాను ఈ విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. జేడీ లక్ష్మీనారాయణతోపాటు, ప్రత్యేక హోదా పోరాట సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, జేబీఎన్పి ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు ఉన్నారు.