ఏం సాధించారని మంత్రులకు జీతాలు ఇస్తున్నారన్న పద్మశ్రీ
విజయవాడ : వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు అందుకుంటున్న జీతాలకు సంబంధించి
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఆర్టీఐని సమాచారం
కావాలని కోరారు. ఆమె లేఖకు స్పందించిన ఆర్టీఐ అధికారులు ఆమెకు సమాచారాన్ని
ఇచ్చారు. అనంతరం ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతి నెలా ఒకటో తేదీనే
మంత్రులకు జీతాలు పడుతున్నాయని… మరి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఏం
చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని
ప్రశ్నించారు. ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేయడమేనా ఉద్యోగులు చేసిన నేరం అని
అన్నారు. జీతాలు ఇవ్వాలంటూ ఉద్యోగులు రోడ్డెక్కుతుంటే ఈ ప్రభుత్వానికి
సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఏం సేవ చేశారని, ఏం
సాధించారని మంత్రులకు జీతాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రిటైర్ అయిన
ఉద్యోగులకు కూడా వారికి అందాల్సిన ప్రయోజనాలను సక్రమంగా ఇవ్వడం లేదని
మండిపడ్డారు. హక్కుల సాధన కోసం ఉద్యోగులు చేసే పోరాటాలకు కాంగ్రెస్ మద్దతు
ఉంటుందని చెప్పారు.