మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అక్కడ పరిస్థితులను చక్కదిద్దేందుకు తమ
ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో మణిపుర్
పరిస్థితులపై ఆయన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం 18 పార్టీలు ఈ
సమావేశానికి హాజరయ్యాయి. పార్టీల అభిప్రాయాలన్నింటినీ విన్న తర్వాత ఆయన
మాట్లాడారు. ‘మణిపుర్లో శాంతి పునరుద్ధరణ కోసం అన్ని పార్టీలూ రాజకీయాలకు
అతీతంగా సలహాలు, సూచనలందించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సూచనలను పెద్ద మనసుతో
పరిశీలిస్తుంది. ప్రధాని మోడీ మొదటి రోజు నుంచీ మణిపుర్ పరిస్థితులను
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సమస్యకు పరిష్కారం కనుగొనడానికి పూర్తి
సున్నితత్వంతో మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. అందరినీ భాగస్వాములను చేసి
సమస్యకు పరిష్కారం కనుగొనాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. అక్కడ నెమ్మదిగా
పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ నెల 13 అర్ధరాత్రి నుంచి
ఇప్పటివరకూ ఒక్కరూ చనిపోలేదు. చోరీకి గురైన 1800 ఆయుధాలను స్వాధీనం
చేసుకున్నాం. 36,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించాం. 40 మంది ఐపీఎస్
అధికారులు, 20 వైద్య బృందాలను మణిపుర్‌కు పంపాం. సమస్య పరిష్కారానికి
సూచనలందించినందుకు అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం
తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ అని పేర్కొన్నారు. భాజపా అధ్యక్షుడు జేపీ
నడ్డా మాట్లాడుతూ.. సమస్యకు సత్వర పరిష్కారం కోసం సాధ్యమైన అన్ని చర్యలూ
తీసుకుంటున్నట్లు తెలిపారు. సమస్య అనేక పాత అంశాలతో ముడిపడి ఉందని
పేర్కొన్నారు. సుమారు 4 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో అఖిలపక్షాన్ని మణిపుర్
తీసుకెళ్లాలని కాంగ్రెస్, సహా పలు పార్టీలు కోరాయి. ముఖ్యమంత్రి బీరేన్
సింగ్‌ను తొలగించాలని మరికొన్ని పార్టీలు డిమాండు చేశాయి. సమావేశంలో బీజేపీ ,
కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే, ఆమ్ ఆద్మీ, భారాస, వైసీపీ , లెఫ్ట్సహా 18
పార్టీలు పాల్గొన్నాయి. ఈశాన్య రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపీలు, ఇద్దరు
ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
అఖిలపక్ష శాంతి బృందాన్ని తీసుకెళ్లాలి : భారాస
సంక్షుభిత మణిపుర్ ప్రజల్లో విశ్వాసం నింపడానికి ఢిల్లీ నుంచి అఖిలపక్ష శాంతి
బృందాన్ని తీసుకెళ్లాలని కేంద్రానికి భారాస మాజీ ఎంపీ, తెలంగాణ ప్రణాళికా
మండలి ఛైర్మన్ బి.వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన
భారాస తరఫున మాట్లాడారు. చేపట్టబోయే చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోడీ
మాట్లాడితే బాగుంటుందని కోరారు. ‘ఇప్పటికీ దేశంలో కులం, మతం, తెగల మధ్య
గొడవలు జరగడం, ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ప్రస్తుతం అక్కడి పరిస్థితులను
అదుపులోకి తీసుకురావాలంటే కుకీ, మైతీ తిరుగుబాటు వర్గాలను తొలుత నిరాయుధులుగా
మార్చాలి. స్థానికుల్లో విశ్వాసం నింపడానికి అఖిలపక్ష శాంతి కమిటీని ఢిల్లీ
నుంచి తీసుకెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో వైసీపీ తరఫున ఆర్థిక మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ తరఫున ఎవరూ హాజరు కాలేదు.