మత్స్యకారుల అవసరాలను తీర్చేందుకు రూ. రూ.5.38కోట్లు నిధులు కేటాయిస్తున్నాం : ఎంపీ బాలశౌరి
బందరు పార్లమెంట్ పరిధిలో తీరనున్న మత్స్యకారుల కష్టాలు, పెరగనున్న జీవన ప్రమాణాలు : ఎంపీ బాలశౌరి
రెండు అతిపెద్ద ఫిషింగ్ ఓడలు, ఫిషింగ్ ఫ్లాట్‌ఫాంలు, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు
మచిలీపట్నం : మత్స్యకారులకు మౌలిక వసతులు కల్పించి, వారి జీవనప్రమాణాలు పెంచి, ఆర్థికవృద్దికి తోడ్పాటు అందించే విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. బందరు పార్లమెంట్ పరిధిలోని అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో నివశిస్తున్న మత్స్యకారుల ఇబ్బందులు, కష్టాలను దగ్గర నుంచి తెలుసుకున్నానని ఆయన తెలిపారు. మత్స్యకార సామాజిక వర్గాన్ని అన్నివిధాలుగా ఆదుకునేందుకు గతంలో చెప్పిన విధంగానే కేంద్ర ప్రభుత్వ సంస్థతో మాట్లాడి దాదాపు రూ.5.38 కోట్ల నిధులను మంజూరు చేయించినట్లు ఎంపీ బాలశౌరి ప్రకటించారు. కేంద్ర సంస్థ నిధులతో మత్స్యకార సామాజిక వర్గాన్ని అన్నిరకాలుగా ఆదుకుంటామని ఎంపీ పేర్కొన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఎస్ఆర్ నిధులతో సముద్రంలోపలికి వెళ్లి డీప్ ఫిషింగ్ చేసేందుకు వీలుండే అత్యాధునిక సాంకేతికతతో కూడిన రెండు అతిపెద్ద బోట్లు, చేపలను తీసుకొచ్చే వాహనం, మత్స్యకార గ్రామాల్లో ఫిషింగ్ ఫ్లాట్‌ఫాంలు ఏర్పాటు, ఆయా గ్రామాల్లో శుద్దిచేసిన తాగునీరు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర సమస్యలకు పరిష్కారం చూపనున్నట్లు ఎంపీ తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎస్ఆర్ నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఇక త్వరలో పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేసి మత్స్యకారులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు చొరవ తీసుకుంటున్నట్లు ఎంపీ బాలశౌరి అన్నారు.
మత్స్యకారులకు జరిగే అభివృద్ది ఇలా
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో గత అయిదేళ్లుగా మత్స్యకారుల అభివృద్ది కోసం జరిగిన పనులు గతంలో ఎన్నడూ జరగలేదని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. బందరు పోర్టుకు శంకుస్థాపన చేయడం, ఆ పోర్టుకు సంబంధించి నిధులు తీసుకురావడం వల్ల నేడు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఎంపీ తెలిపారు. పోర్టు అందుబాటులోకి వస్తే కృష్ణా జిల్లాలోని మత్స్యకార యువతకు ఉపాధి లభిస్తుందని, ఆయా వర్గాలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వీలుందని ఆయన చెప్పారు. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థతో మాట్లాడి మత్స్యకార యువతకు ఉపాధి అవసరాలు తీరేలా రెండు అతిపెద్ద బోట్లను రూ.3.22కోట్లు పెట్టి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎంపీ తెలిపారు. వీటి ద్వారా సముద్రంలో లోపలికి వెళ్లి ఖరీదైన చేపలను పట్టి వాటిని విక్రయించుకోవడం వల్ల ఆర్థికంగా యువత ఎదిగేందుకు ఉపయెగపడుతుందన్నారు. అదేవిధంగా మరో రూ.14లక్షలు వెచ్చించి చేపలను తరలించే వాహనాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు మహిళలు సైతం చిరు వ్యాపారాలు చేసుకునేలా వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో సకల సౌకర్యాలతో ఫిష్ ఫ్లాట్‌ఫాంలు రూ. 1.66కోట్లు వెచ్చించి మత్స్యకార గ్రామాల్లో ఏర్పాటు చేయించనున్నట్లు ఎంపీ బాలశౌరి చెప్పారు. ఫిష్ ఫ్లాట్‌ఫాంలు ఏర్పాటు చేసే ప్రాంతంలో విద్యుత్తు, నీరు ఇతర సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మత్స్యకార గ్రామాల్లో తాగునీరు, మెరుగైన వైద్యం అందించేందుకు మరో రూ.33లక్షలను వెచ్చించి తాగునీరు అందించే మైక్రోవాటర్ ఫిల్టర్లు, పీహెచ్‌సీల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. తుఫానుల సంభవించినప్పుడు, భారీ వర్షాల సమయంలో చేపలు తడిచిపోకుండా, పాడవకుండా మరో రూ.12 లక్షలతో మత్స్యకార రైతుల కోసం షెడ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ తెలిపారు. ఇవన్నీ కలిపి దాదాపు రూ.5కోట్ల 38 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
బందరు పోర్టుతో మొదలైన అభివృద్ది
మచిలీపట్నం పోర్టు పనులతో అభివృద్ది పనులు మొదలైనట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. పోర్టు పూర్తయితే ఎంతో మంది యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. గత కొంతకాలంగా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ప్రజల ఇబ్బందులు, కష్టాలను గుర్తించి తనకు మద్దతుగా ఉన్న ప్రజల కోసం ఏదైనా చేయాలని సంకల్పంతో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు ఎంపీ తెలిపారు. మచిలీపట్నం పేరులోనే మచిలీ అనగా చేపలు ఉన్నాయని, ఈ ప్రాంతంలో విరివిగా ఉన్న అగ్నికుల క్షత్రియులను ఎప్పుడు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని ఎంపీ బాలశౌరి తెలిపారు. వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే ఉంటానన్నారు. ఇప్పుడు చేస్తున్న సాయంతోపాటు మత్స్యకార సామాజిక వర్గాలకు వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి చిన్న చిన్న పడవలు, వలలు, ఫిష్ డ్రై ప్లాట్ ఫారంలు నిర్మాణం మొదలైన వాటి కోసం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు మంజూరు చేయించే కార్యక్రమం అతి త్వరలో చేపడుతున్నట్లు ఎంపీ తెలిపారు. త్వరలోనే అతి పెద్ద లోన్ మేళా కార్యక్రమం నిర్వహించి ప్రతి మత్స్యకార కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించబోతున్నట్లు ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు.