ఇటీవల కారు ప్రమాదంలో టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్ గాయపడిన సంగతి
తెలిసిందే. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స
పొందుతున్న పంత్‌ను మరింత మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు
చేస్తున్నారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంత్ కోలుకునేందుకు కనీసం
ఆరు నెలలు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది అతను క్రికెట్
ఆడడం కష్టమనిపిస్తోంది. జనవరిలో ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గావస్కర్
టెస్టు సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2023 సీజన్లో పంత్ ఆడకపోవచ్చు అనే
అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంత్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతను ఎప్పుడు
కోలుకుంటాడో చెప్పలేని పరిస్థితి ఉంది. లిగమెంట్ గాయం నుంచి పంత్
కోలుకోవాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని
వైద్యులు తెలిపారు. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే అప్పుడు మరింత సమయం పట్టే
అవకాశం ఉందన్నారు.
శస్త్రచికిత్స కోసం ముంబైకి తరలింపు :
రెండు మోకాలి స్నాయువులలో ఒకదానికి అత్యవసర శస్త్రచికిత్స అవసరం కావడంతో
భారత క్రికెట్ బోర్డు రిషబ్ పంత్ ను డెహ్రాడూన్ నుండి బుధవారం ముంబైలోని
కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. డిసెంబర్ 30న రిషబ్ పంత్
రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.