అభివృద్ధి పనులు మరో ఐదు నెలల్లో పూర్తి కానున్నట్లు బందరు పోర్టు అధికారి
కెప్టెన్ ధర్మ శాస్త్ర పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం గిలకలదిండిలోని ఆయన
కార్యాలయంలో మాట్లాడుతూ మచిలీపట్నం లో సముద్రంలో చేపల వేటపై ఆధారపడి
జీవిస్తున్న మచిలీపట్నం పరిసర ప్రాంతాల మత్స్యకారుల చిరకాల స్వప్నం మరికొద్ది
నెలల్లో ఆవిష్కృతమవుతుందన్నారు, దాదాపు 2009 ఈ సంవత్సరం నుండి సముద్రము మొగ
పూడిక తీయించాలని డిమాండ్ ఈ ప్రాంతంలో ఉందన్నారు. ఈ సమస్య గూర్చి మాజీ
మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ముఖ్యమంత్రి
జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, కేవలం మచిలీపట్నం లోనే కాకుండా
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 చోట్ల ఫిషింగ్ హార్బర్ ల అభివృద్ధి, జట్టీల
నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రభుత్వం చేస్తున్న కృషిలో
భాగంగా మత్స్యకారులకు 348 కోట్ల రూపాయలతో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు
రూపకల్పన జరిగిందని తెలిపారు.ఇప్పుడు జరుగుతున్న డ్రెడ్జింగ్ పనులు 3.5 మీటర్ల లోతున, 10.50 లక్షల క్యూబిక్
మీటర్ల మట్టి త్రవ్వడం జరుగు తుందన్నారు తద్వారా రాబోయే 50 ఏళ్ల దాకా
మత్స్యకారులకు చేపలవేటకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నారు. సముద్ర మొగకు దక్షిణం
వైపు గల కృష్ణా నది సిల్ట్ కారణంగా మొగ పూడికకు కారణం అవుతున్నదని, దీని
నివారణకు దక్షిణం వైపు 1240 మీటర్లు, ఉత్తరం వైపు 1150 మీటర్ల పొడవైన గోడ
నిర్మించడం జరుగుతుందని అన్నారు. మొత్తంగా కాలువ మైనస్ 4 మీటర్ల డ్రెడ్జింగ్
చేయడం జరుగుతుందనీ చెప్పారు.మత్స్యకారులు ఫిషింగ్ చేశాక దిగుమతి కోసం ఒకేసారి
600 బోట్లు నిలబెట్టుటకు 790 మీటర్ల ‘ కే ’ వాల్ సైతం నిర్మించడం జరుగుతుందని,
మత్స్య సంపద ఎగుమతి దిగుమతుల కోసం మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం
జరుగుతుందని, ఈ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
హార్బర్ పనుల పరిశీలన ప్రజా ప్రతినిధులు : సముద్ర తీరాన నిర్మిస్తున్న హార్బర్
పనులను మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ పలువురు
కార్పొరేటర్లతో యువ నాయకుడు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు
పేర్ని కృష్ణమూర్తి (కిట్టు ) పరిశీలించారు. నాలుగు మరపడవల్లో సముద్ర మొగ వరకు
అక్కడ జరుగుతున్న డ్రెడ్జింగ్ పనులను గమనించారు. స్థానిక మత్స్యకారులు హార్బర్
పూడిక నిర్మాణ పనుల్లో సహకరించాలని, కొద్ది నెలల్లో మచిలీపట్నం ఫిషింగ్
హార్బర్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమవుతుందని, భారీ తుఫాన్లు
సంభవించినా హార్బర్ పట్టిష్టంగా తట్టుకుంటుందన్నారు. వలకట్ల విషయంలో
కొద్దిరోజులపాటు త్యాగం చేయాలని వారు స్థానిక మత్స్యకారులకు సూచించారు. ఈ
హార్బర్ పనుల సందర్శన కార్యక్రమంలో మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ
మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత థామస్ నోబుల్, పోర్టు అధికారి ధర్మ
శాస్త, ఎస్ఈ నగేష్, టెక్నికల్ హెడ్ చైతన్య, ముని కుమార్, మాజీ జెడ్పిటిసి లంకె
వెంకటేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ తిరుమల శెట్టి వరప్రసాద్, విశ్వనాథపల్లి
వీరబాబు పలువురు కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.