ఇటీవలే భారత్ జోడో యాత్ర ముగించుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో
పాదయాత్రకు సిద్ధమవుతున్నారా? అంటే హస్తం పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం
వస్తోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన సుదీర్ఘ భారత్ జోడో యాత్ర
విజయవంతం కావడం రాహుల్ గాంధీలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ కొత్త ఉత్సాహాన్ని
కలిగించింది. రాహుల్ అదే ఊపులో ఈసారి పశ్చిమ తీరంలోని గుజరాత్ నుంచి ఈశాన్య
రాష్ట్రం అసోం వరకు పాదయాత్ర చేసే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు
తెలిపాయి. ఈ యాత్ర గుజరాత్ లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన పోరుబందర్ లో మొదలై
అసోంలో ముగుస్తుందని వివరించాయి. జాతిపిత మహాత్మాగాంధీ జన్మస్థలంగా పోరుబందర్
కు విశేష ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో రాయ్ పూర్ లో ఏఐసీసీ ప్లీనరీ సమావేశం
జరగనుంది. రాహుల్ తాజా పాదయాత్రపై ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ పాదయాత్రకు తేదీలు ఇంకా ఖరారు కాలేదని, బహుశా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
ముగిసిన తర్వాత కానీ, ఈ ఏడాది చివర కానీ ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు
వెల్లడించాయి.