విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంధకారం నెలకొందని, విద్యుత్
చార్జీలతో,కరెంటు కోతలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారని ఏపీసీసీ
అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఆంధ్ర
రత్నభవన్ లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మరో విద్యుత్ ఉద్యమానికి
సిద్ధమవుతుందని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ ఇస్తే, తనయుడని విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి
విరుస్తున్నాడని ఆయన ఆరోపించారు. అమెరికాలో రాహుల్ గాంధీ పర్యటన
విజయవంతమైందని అడుగడుగునా ప్రవాస భారతీయులు ఉత్సాహంతో రాహుల్ గాంధీతో కలిసి
పని చేయాలని నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు.
చంద్రబాబు హాయంలో విద్యుత్ చార్జీలపై ఉద్యమించారు. ప్రస్తుతం మనం మరో విద్యుత్
ఉద్యమానికి సిద్ధం అవ్వాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
విద్యుత్ చార్జీలపై ప్రజా సంఘాలు అన్ని పార్టీలతో కలిసి సమావేశం ఏర్పాటు
చేయబోతున్నట్లు రుద్రరాజు ప్రకటించారు. జగన్ నాలుగేళ్లు, మోడీ తొమ్మిదేళ్ల
పాలనలో మన రాష్ట్రానికి జరిగింది శూన్యమని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్
ప్రారంభోత్సవం చేయలేకపోతుందన్నారు. పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్
పై అమిత్ షా ఎందుకు నోరు మెదపటం లేదని అమిత్ షా ని ప్రశ్నించారు. రాబోయే
ఎన్నికల్లో బిజెపికి 20 సీట్లు వస్తాయనడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో అధ్యక్షులతోపాటు కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర
పద్మశ్రీ, సిటీ అధ్యక్షులు నరహర శెట్టి నరసింహారావు, వి గురునాథం, కొలనుకొండ
శివాజీ, బొర్రా కిరణ్ కుమార్, మీసాల రాజేశ్వరరావు, లీగల్ సెల్ వైస్ చైర్మన్
డాక్టర్ జంధ్యాల శాస్త్రి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.