మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.500 కోట్లను 15
ఏళ్ల కాలానికి, ఇంకో రూ.500 కోట్లను 12 ఏళ్ల కాలానికి అప్పుగా తీసుకొచ్చారు.
వీటిపై 7.36 శాతం నుంచి 7.39 శాతం వడ్డీ చెల్లించాలి. ఏప్రిల్ నుంచి ఇప్పటి
వరకు ఆర్బీఐలో సెక్యూరిటీల వేలం ద్వారా ప్రభుత్వం రూ.19,500 కోట్ల అప్పు
తెచ్చింది. ఆ ఆర్థిక సంవత్సరానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి
రూ.30,275 కోట్ల అప్పులకు అనుమతిచ్చింది. ఇందులో ఇంకా రూ.10,774 కోట్ల పరిమితి
మాత్రమే మిగిలి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో రూ. 1,000 కోట్ల రుణం సమీకరించింది. దీంతో
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్న రుణం
రూ. 19,500 కోట్లకు చేరింది. 74 రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తం అప్పు
చేసినట్లయింది. గతంలో ఎన్నడూ లేనట్లు కిందటి నెలలో కేంద్రం ఒకేసారి రూ.10 వేల
కోట్లకు పైగా అదనపు నిధులు మంజూరు చేసినా ఆ నెల, ఈ నెలలో కూడా అధిక రుణాలు
సమీకరిస్తుండటం గమనార్హం. తాజాగా మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వహించిన
సెక్యూరిటీల వేలంలో రూ. 500 కోట్లను 12 ఏళ్ల కాల పరిమితితో తీర్చేలా 7.39 శాతం
వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మరో రూ. 500 కోట్లు 15 ఏళ్ల
కాలపరిమితితో తీర్చేలా 7.36 శాతం వడ్డీకి సమీకరించింది. రాష్ట్ర జీఎస్డీపీ
(రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనాల ఆధారంగా) బట్టి కేంద్రం ఏటా రాష్ట్రాలకు రుణ
పరిమితిని నిర్ణయిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు నెలాఖరు వరకు
ఆంధ్రప్రదేశ్ రూ. 30,275 కోట్ల రుణం తీసుకోవచ్చని కేంద్ర ఆర్థికశాఖ
అనుమతించింది. అలాంటిది కేవలం రెండు నెలల 13 రోజుల్లోనే ఈ స్థాయిలో రుణం
తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఆర్థిక సంవత్సరం తొలి నెలలో రూ. 6,000 కోట్లు,
మే నెలలో రూ. 9,500 కోట్లు సమీకరించింది. జూన్లో 13 రోజుల్లో ఏకంగా రూ. 4,000
కోట్ల మేర అప్పులు చేసింది.