సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి
గుంటూరు : రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ మరో మైలురాయిని అధికమించింది. సాంకేతిక విద్యలో శ్రేష్ఠత, నాణ్యత పట్ల ఆశాఖ తన నిబద్ధతను మరోసారి ప్రదర్శించింది. నేషనల్ బోర్డ్ ఆప్ అక్రిడేషన్ ప్రమాణాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ కళాశాలలను తీర్చిదిద్దటంలో తన ప్రత్యేకతను కనబరుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు నేషనల్ బోర్డ్ ఆప్ అక్రిడేషన్ (ఎన్ బిఎ) పొందగా, మూడో విడతలో 12 పాలిటెక్నిక్‌లు ఎన్ బి ఎ దక్కించుకున్నాయి. ఇప్పటి వరకు, సాంకేతిక విద్యా శాఖ పరిధిలోని 31 పాలిటెక్నిక్‌లలో 60 విభాగాలలో అక్రిడిటేషన్‌ను సాధించారు. విద్యా ప్రమాణాలను పెంపొందిస్తూ విభిన్న సాంకేతిక విభాగాల్లో అత్యున్నత స్థాయి శిక్షణ పొందేలా చేయడంలో సాంకేతిక విద్యాశాఖ యెక్క అచంచలమైన అంకితభావాన్ని ఈ విజయం నొక్కి చెబుతుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ బృందం 2024-25, 2025-26, 2026-27 విద్యా సంవత్సరాలకు గాను 24 ప్రోగ్రామ్‌లకు అక్రిడిటేషన్‌ను నిర్ధారించింది.
తాజాగా ఎన్ బి ఎ గుర్తింపు పొందిన వాటిలో అనంతపురం, శ్రీశైలం, తిరుపతి, పిల్లరిపట్టు, శ్రీకాకుళం, రాజమండ్రి, జమ్మలమడుగు, కదిరి ప్రభుత్వ పాలిటెక్నక్ లు ఉన్నాయి. నందిగామ, పలమనేరు, కడప మహిళా పాలిటెక్నిక్ లతో పాటు మదనపల్లె మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ సైతం ఎన్ బి ఎ దక్కించుకుంది. ఈ సందర్భంగా సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల అంకితభావం, కృషి ఫలితంగానే ఈ ఘనత సాధ్యమైందన్నారు. అత్యున్నత నాణ్యమైన విద్యను అందిస్తూ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్ధులను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఎన్ బిఎ గుర్తింపు ఫలితంగా విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించగలుగుతామని, ఫలితంగా వారు మంచి మార్గాలను అన్వేషించగలుగుతారని వివరించారు. సాంకేతిక రంగంలో రాణించడానికి అవసరమైన పూర్తి స్దాయి నైపుణ్యం రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్య అందించగలుగుతుందని నాగరాణి తెలిపారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ లు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ సాధించిన క్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.