57 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : ఇప్పటి వరకు 60వేల పైచిలుకు పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం
అనుమతులు ఇవ్వగా మరో 16వేలకు పైగా పోస్టులకు త్వరలోనే అనుమతులు ఇవ్వనున్నట్టు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఉద్యోగ నియామక
ప్రక్రియపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డితో కలిసి వివిధ
శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్
ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో 60,929 పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు
జారీ చేసినట్టు తెలిపారు. మరో 16,940 పోస్టులకు కూడా త్వరలోనే అనుమతులు
ఇవ్వనున్నట్టు చెప్పారు. నియామకాల ప్రక్రియలో గడువులు నిర్దేశించుకొని
పనిచేయాలన్న సోమేశ్‌కుమార్.. ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని
అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు వీలుగా
అవసరమైన సమాచారాన్ని కమిషన్‌కు అందించాలని ఆయా శాఖల అధికారులకు సీఎస్ స్పష్టం
చేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియ పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించాలని
ఆదేశించారు.
57 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల : భూగర్భ జలవనరుల శాఖలో 57 పోస్టుల
భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 32 గెజిటెడ్, 25
నాన్ గెజిటెడ్ పోస్టులు ఉన్నాయి. డిసెంబరు 6 నుంచి 27 వరకు దరఖాస్తులు
స్వీకరించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది.