వెలగపూడి : రాష్ట్ర శాసనమండలిలో త్వరలో ఖాళీకానున్న ఏడు స్థానాలకు భారత
ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. శాసన మండలికి
శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికైన నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు,
డొక్కా మాణిక్య వరప్రసాద్, పెన్మెత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజు, గంగుల
ప్రభాకరరెడ్డి పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. శాసనసభ్యుల కోటా నుంచి
ఎన్నికైన చల్లా భగీరథరెడ్డి గతేడాది నవంబరు 2న అనారోగ్యంతో మృతిచెందడంతో ఆ
స్థానం కూడా ఖాళీగా ఉంది. ఈ ఏడింటికీ మార్చి 23న ఎన్నికలు నిర్వహించనున్నారు.
పదవీకాలం పూర్తవుతున్న నారా లోకేశ్, బచ్చుల అర్జునుడు టీడీపీ ఎమ్మెల్సీలు
కాగా పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాద్, పెన్మెత్స వరాహ వెంకట
సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకరరెడ్డి వైసీపీ సభ్యులు, మృతిచెందిన చల్లా
భగీరథరెడ్డి కూడా వైసీపీ కి చెందిన వారు. మండలిలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు,
స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎన్నికైన 14 మంది పదవీకాలం పూర్తికానున్న
నేపథ్యంలో వాటికి మార్చి 13న ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.