జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
ఏలూరు : మల్లవల్లి పారిశ్రామికవాడ కోసం సేకరించిన భూములకు సంబంధించి 124మంది
రైతులకు ఇప్పటికీ పరిహారం అందించకుండా వేధింపులకు గురి చేస్తున్న తీరు పాలకుల
నియంతృత్వ ధోరణికి అద్దంపడుతోందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
గారు అన్నారు. 2016లో పారిశ్రామికవాడ కోసం సేకరించిన 14వందల ఎకరాల్లో ఇప్పటికీ
302 ఎకరాలకు పరిహారం ఇవ్వకపోవడంతో ఆ భూములపై ఆధారపడ్డ కుటుంబాలు
రోడ్డునపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిహారం కోసం ప్రజా ప్రతినిధుల
చుట్టూ తిరిగితే కులాలవారీగా, ప్రాంతాలవారీగా విడదీసి మాట్లాడటం దురదృష్టకరం
అన్నారు. ఏలూరులో ఉన్న పవన్ కళ్యాణ్ ని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని
మల్లవల్లి పారిశ్రామికవాడ నిర్వాసితులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు
పరిహారం ఇప్పించాలని నిరసన తెలిపితే హత్యాయత్నం కేసులు నమోదు చేసి జైలుకు
పంపించారని, తప్పుడు కేసులతో వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. పవన్
కళ్యాణ్ స్పందిస్తూ “జీవనాధారమైన భూమిని కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడం
ప్రభుత్వ విధి. పరిహారం అడిగిన రైతులను కులాలు, ప్రాంతాలవారీగా విడదీసి
మాట్లాడటం, ఓటు బ్యాంకుగా చూడటం దురదృష్టకరం. కాయకష్టంతో పంట పండించే రైతుకి
కులం అంటగట్టడం ఏమిటి? మల్లవల్లి భూనిర్వాసితులకు జనసేన అండగా నిలుస్తుంది.
అన్యాయంగా అకారణంగా కేసులుపెట్టి, దాడి చేసి వేధించడం అమానుషం. వారికి అవసరమైన
న్యాయ సహాయాన్ని కూడా అందిస్తాం. క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్ళి బాధిత
రైతులతో సమావేశం నిర్వహిస్తాను. టీడీపీ హయాంలో ఇచ్చారు కాబట్టి మల్లవల్లి
రైతుల పోరాటానికి మద్దతు తెలపాలని చెబుతానన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ
వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.