సియోల్: తమ ప్రత్యర్థి దేశమైన దక్షిణ కొరియాకు అగ్రరాజ్యం అమెరికా ఆయుధ సాయం
అందిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తర కొరియా ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది.
సోమవారం అర్ధరాత్రి తర్వాత రెండు షార్ట్–రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను
ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్
బహిర్గతం చేశారు. ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం క్షిపణి ప్రయోగం
నిర్వహించడం గత వారం రోజుల వ్యవధిలో ఇది మూడోసారి కావడం గమనార్హం. రాజధాని
పాంగ్యాంగ్ సమీప ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ రెండు బాలిస్టిక్ మిస్సైళ్లు
400 కిలోమీటర్లు(248 మైళ్లు) ప్రయాణించి తూర్పు కోస్తా తీరంలో సముద్రంలో
పడిపోయాయి. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై జపాన్ ప్రధానమంత్రి ఫుమియో
కిషిడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడొద్దని
హెచ్చరించారు. తమ నిరసనను ఉత్తర కొరియాకు తెలియజేశామని చెప్పారు.