నేడు ఉజ్జయిని మహంకాళి బోనాలు
సతీసమేతంగా అమ్మవారి ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్
అమ్మవారికి స్వయంగా పట్టువస్త్రాల సమర్పణ
బంగారు బోనంతో మహంకాళి ఆలయానికి తరలివచ్చిన కవిత
హైదరాబాద్ : ఆషాఢ మాసం సందర్భంగా బోనాల సందడితో హైదరాబాద్ నగరం కళకళలాడుతోంది.
నేడు ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
సతీసమేతంగా సికింద్రాబాద్ వచ్చారు. ఆలయానికి వచ్చిన కేసీఆర్ దంపతులను అర్చకులు
వేదమంత్రాలతో స్వాగతించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు
చేశారు. అమ్మవారికి సీఎం కేసీఆర్ స్వయంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ
సందర్భంగా సీఎం వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్,
మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీలు సంతోష్
కుమార్, కె.కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు. అటు,
కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉజ్జయిని మహంకాళికి
బంగారు బోనమెత్తారు. కుటుంబ సభ్యులు, అభిమానులు వెంటరాగా ఆలయానికి విచ్చేసిన
ఆమె అమ్మవారికి బోనాలు సమర్పించారు.