నెల్లూరు : రాష్ట్రంలోని మహిళలకు అండగా నిలుస్తూ, వారు ఆర్ధిక స్వాలంబన
సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, సహకార,
మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
పేర్కొన్నారు. వైయస్ఆర్ ఆసరా మూడవ విడత రాష్ట్ర వ్యాప్తంగా 7.98 లక్షల మహిళా
సంఘాలలోని 78.94 లక్షల అక్క చెల్లెమ్మలకు లబ్ది చేకూరేలా 6,419.89 కోట్ల
రూపాయలు నేరుగా మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో జమచేసే కార్యక్రమాన్ని రాష్ట్ర
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శనివారం ఏలూరు జిల్లా దెందులూరు నుండి బటన్
నొక్కి జమ చేశారు. అందులో భాగంగా నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూరిభా
కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన వైయస్సార్ ఆసరా మూడో విడత లబ్ధి పంపిణీ
కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ
మంత్రి గోవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, శాసన మండలి
సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి లతో కలసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.
ఈ సంధర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలకు అండగా
నిలుస్తూ, వారు ఆర్ధిక స్వావలంబన సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి
చేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాద యాత్ర సమయంలో స్వయం
సహాయక సంఘాలలో ఉన్న మహిళల ఆర్థిక ఇబ్బందులను కళ్ళారా చూసి, చలించి, తన
ప్రభుత్వం వచ్చిన తక్షణమే అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల బ్యాంకు ఋణాల
మొత్తాన్ని 4 విడతల్లో పొదుపు సంఘాల ఖాతాల ద్వారా నేరుగా అందిస్తానని
తెలియచేయడం జరిగిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే రెండు విడతలుగా
చెల్లించడం జరిగిందన్నారు. మూడో విడత నిధులను నేడు పంపిణీ చేయడం జరుగుచున్నదని
మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత
మెరుగుపడి, పేద మహిళల యొక్క ఆర్ధిక పురోగతికి దోహదపడుతుందన్నారు.
జిల్లాకు సంబంధించి తొలి విడత 2020-21 సంవత్సరంలో 31,569 సంఘాల లోని 3,09,877
మందికి 250.23 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 2వ
విడతలో 2021-22 సంవత్సరంలో 34,323 సంఘాల లోని 3,28,646 మందికి 285.18
కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని, నేడు 3వ విడతలో 34,443 సంఘాల లోని
3,29,815 మందికి 290.17 కోట్ల రూపాయలను జమ చేస్తున్నట్లు మంత్రి
గోవర్ధన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా ఆ పథకం మహిళలకే
చెందేలా అమలుచేయడం జరిగిందన్నారు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, ఆసరా,
చేయూతతో పాటు గృహాలను కూడా మహిళల పేరునే మంజూరుచేస్తున్న సంగతిని మంత్రి
గుర్తుచేసారు.ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత
మెరుగుపడి, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల
యొక్క ఆర్ధిక పురోగతికి దోహదపడుతుందన్నారు.