మచిలీపట్నం : స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలన్నది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహోన్నత సంకల్పమని, వారు ఇతరులపై
ఆధారపడకుండా స్వశక్తితో జీవించేలా ప్రోత్సహించేందుకు ‘వైఎస్సార్ ఆసరా’
పథకానికి ఆయన రూపకల్పన చేశారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన వైయస్ఆర్ ఆసరా పథకం వారోత్సవాలు భాగంగా పెడన
నియోజవర్గం గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలోని మీ- సేవ కేంద్రం సమీపంలోని
ఖాళీ స్థలం వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత
మంత్రి జోగి రమేష్ గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో 40 లక్షల రూపాయలతో
నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయం, అలాగే 21 లక్షల 80 వేల రూపాయల
వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న రైతు భరోసా కేంద్రం భవనాలకు ప్రారంభోత్సవ
కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన కప్పలదొడ్డి బహిరంగ సభలో మంత్రి
జోగి రమేష్ ప్రసంగిస్తూ,గత ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు తీరని అన్యాయం
జరిగిందన్నారు. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని నాటి
ముఖ్యమంత్రి ఎంతో ఆర్భాటంగా ప్రకటించారన్నారు. దీంతో మహిళలు రుణాలు
చెల్లించలేదని అనంతరం అధికారంలోకి వచ్చిన ఆ నాయకుడు ఇచ్చిన హామీ ఊసే
ఎత్తలేదన్నారు. చేసేది లేక మహిళలు చేసిన అప్పుకు వడ్డీతో సహా చెల్లించాల్సిన
దుస్థితి తలెత్తిందని మంత్రి జోగి రమేష్ గుర్తు చేశారు. ఎందరో అక్క
చెల్లెమ్మలు అప్పుకోసం బ్యాంకర్ల ద్వారా వేధింపులకు గురయ్యారని తిరిగి 2019
ఎన్నికల సమంయలో సైతం మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు బాబు కొత్త
పన్నాగం పన్నారన్నారు. ఎన్నికల సమయంలో తాయిలాలుగా పసుపూకుంకుమ కింద నగదు
అందజేసి చేతులు దులుపుకున్నారు. ఆ నాయకుని తీరు ఎంతో తెలివిగా గ్రహించిన
డ్వాక్రా మహిళలు ఎన్నికల్లో ఆ పార్టీని దూరం పెట్టారని వివరించారు. 2019
ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అధికారం కట్టబెట్టారన్నారు. అనంతరం వైయస్సార్
ఆసరా మూడవ విడత కార్యక్రమంలో పాల్గొన్నారు. కప్పలదొడ్డి, ఆకులమన్నాడు, గండ్రం,
రామానుజవర్తలపల్లె, లేళ్ళ గరువు, ముక్కోల్లు, గురిజేపల్లె, పోసినవారి పాలెం
గ్రామాలకు 322 స్వయం సహాయక సంఘాలకు చెందిన 2,347 మంది లబ్ధిదారులకు వైయస్సార్
ఆసరా మూడో విడత నగదు 2 కోట్ల 23 లక్షల 65 వేల 668 రూపాయలను పంపిణీ కార్యక్రమం
నిర్వహించారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
పాల్గొని వారి చేతులమీదుగా రూ. 2, 23, 65, 668 కోట్లు మెగా చెక్కును మండలం
డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఆదించారు. తొలుత డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలకు
జగనన్న చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, జగనన్న కు, మంత్రి జోగి రమేష్ కు
వేలాది మంది మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు.