ఇస్లామిక్ మత గ్రంథాలు, సిద్ధాంతాలు, విశ్వాసాల ఆధారంగా మహిళలు కూడా మసీదుల్లో
ప్రవేశించి ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఉందని ఆలిండియా ముస్లిం పర్సనల్
లా బోర్డు (ఏఐఎంపీఎల్ బీ) సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అయితే మసీదుల్లో
పురుషులు, మహిళలు కలిసి ప్రార్థనలు చేసుకోవచ్చని మత గ్రంథాల్లో ఎక్కడా
చెప్పలేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. పవిత్ర మక్కాలోని కాబా
మసీదులో సైతం పురుషుల నుంచి మహిళలను వేరు చేస్తూ బారికేడ్లు ఉంటాయని
తెలిపింది. ప్రార్థనల సందర్భంగా పురుషులు ఒక వైపు ఉంటే, మహిళలంతా బారికేడ్లకు
అవతలి వైపు ఉంటారని వివరించింది.
మహిళలు, పురుషులు కలిసి ప్రార్థనలు చేయకపోవడం అనేది భక్తుల ఇష్టపూర్వకంగానే
జరుగుతుందని, వేర్వేరుగా ప్రార్థనలు చేయాలన్న సంప్రదాయాలకు వారు ఇష్టపూర్వకంగా
కట్టుబడి ఉంటారని ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. మహ్మద్ ప్రవక్త
కాలం నుంచి ఇది అమల్లో ఉందని పేర్కొంది. మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు
మహిళలను అనుమతించడం లేదంటూ ఫరా అన్వర్ హుస్సేన్ షేక్ అనే మహిళ సుప్రీంకోర్టులో
పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు అఫిడవిట్
సమర్పించింది. పై వ్యాఖ్యలన్నీ తన అఫిడవిట్ లో పొందుపరిచింది.
భారత్ లో మసీదుల్లోకి ముస్లిం మహిళలను అనుమతించకపోవడం అక్రమం, రాజ్యాంగ
విరుద్ధం అని ఫరా తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇస్లామిక్ సూత్రాలపై ఆధారపడి
గౌరవంతో కూడిన జీవితాన్ని మహిళలకు అందించాల్సిన అవసరం ఉందని ఆమె
అభిప్రాయపడ్డారు. అందుకు ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందిస్తూ, రోజుకు
ఐదుసార్లు నిర్వహించే ప్రార్థనల్లో ముస్లిం మహిళలు కూడా పాల్గొనడం తప్పనిసరి
అని ఇస్లాం మతంలో పేర్కొనలేదని వివరించింది. అంతేకాకుండా, మహిళలకు శుక్రవారం
సంప్రదాయ ప్రార్థనలు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అయితే, మసీదులో కానీ,
ఇంటి వద్ద కానీ ప్రార్థనలు చేసుకునే వెసులుబాటు మహిళలకు ఉందని, మహిళలు
కచ్చితంగా మసీదుకే వచ్చి ప్రార్థనలు చేయాలన్న నిబంధన మాత్రం లేదని బోర్డు
పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో, ప్రైవేటు స్థలాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై
ఇస్లాం మతానికి నిర్దిష్ట సిద్ధాంతాలు ఉన్నాయని తన అఫిడవిట్ లో
సుప్రీంకోర్టుకు నివేదించింది.