రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
భద్రాద్రి, రామప్పఆలయాల సందర్శన
ఏకలవ్య పాఠశాలల ప్రారంభం
ఖమ్మం: మహిళల అభ్యున్నతితోనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యాఖ్యానించారు. విద్యార్థులు చదువులు పూర్తి చేసి, స్వావలంబన సాధించాక సమాజ పురోగతికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ఆ బాధ్యత ప్రభుత్వానిదో లేదా సంబంధిత సంస్థలదో కాదని, అందరి కర్తవ్యమని ఉద్బోధించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలోని సీతారాముల క్షేత్రాన్ని, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని రాష్ట్రపతి సందర్శించారు. భద్రాచలంలోని వీరభద్ర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమ్మక్క-సారలమ్మ గిరిజన పూజారుల సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన ప్రాంతాల్లో విద్యా సదుపాయాలు మెరుగుపరిచేందుకు నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించి నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే కవితా పంక్తులు ప్రస్తావించారు. తాను తెలుగు నేర్చుకునేందుకు కొంత సమయం పడుతుందన్నారు. తెలంగాణలో మొదటిసారి పర్యటన సందర్భంగా భద్రాద్రి శ్రీరాముల వారిని దర్శించుకుని దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించానన్నారు. తెలంగాణ వనవాసీ పరిషత్ ద్వారా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించటాన్ని కొనియాడారు. సమ్మక్క-సారలమ్మ లాంటి జాతరలు సమాజ మూల విలువలను పటిష్ఠపరుస్తాయన్నారు.
గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: సత్యవతి రాథోడ్
రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజనులు, మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రంలో 23 ఏకలవ్య పాఠశాలలు నడుస్తున్నాయని చెప్పారు. గిరిజన బాలికలకు 33 గురుకులాలు, 183 పాఠశాలలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గిరిజన బిడ్డ రాష్ట్రపతి కావడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, గవర్నర్ తమిళిసైలను వనవాసీ పరిషత్ సభ్యులు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.