విజయవాడ : సమాజంలో, సోషల్ మీడియాలో మహిళలపై నీచమైన దాడి చేసేవారిని
ఉపేక్షించవద్దని అటువంటి వారిని వేలెత్తి చూపాలని, చట్టపరంగా కఠిన చర్యలు
తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. శుక్రవారం
మేరీస్ స్టెల్లా కాలేజీలో విద్యార్థినుల సమక్షంలో “ఉమెన్ డిగ్నిటీ డే”
ప్రారంభిస్తూ ఆమె మాట్లాడారు. ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం కొనసాగించడానికి
అందరూ చేయి చేయి కలపాలని పిలుపునిచ్చారు. సి.ఐ.డి ఎస్ పి సరిత, స్టెల్లా
కాలేజ్ ప్రిన్సిపాల్ జసింత, ఆర్ సూయజ్, మానవీ ట్రస్ట్ మేఘన, విద్యార్థినులతో
కలిసి మహిళా గౌరవానికి సూచికంగా పింక్ బెలూన్లను గాలిలోకి వదిలి డిగ్నిటీ డే
ను వాసిరెడ్డి పద్మ ఘనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుందని సమాన అవకాశాలను ఒక హక్కుగా గుర్తించిందని
వాసిరెడ్డి పద్మ వివరిస్తూ మహిళల పట్ల సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను యువత
ధైర్యంగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం జరిగే ఉమెన్ డిగ్నిటీ డే
మహిళలకు భరోసా, పిచ్చి వేషాలు వేసే వారికి ఒక హెచ్చరికగా సాగాలని అన్నారు.
ఎస్పీ సరిత మాట్లాడుతూ ఉమెన్ డిగ్నిటీ డే అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు
అన్నారు, మొట్టమొదటిసారిగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డిగ్నిటీ
డే ను ప్రారంభించారన్నారు. దిశ యాప్ ను విద్యార్థినులు ఒక రక్షణ కవచంగా
మార్చుకోవాలని సూచించారు. సమస్యలలో ఉన్న మహిళలకు ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం
సహాయపడే విధానాలను వివరించారు. హెల్ప్ లైన్ నంబర్లను ప్రతి ఒక్కరూ
గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మానవి ట్రస్ట్ మేఘన, మార్పు
ట్రస్ట్ సూయజ్, మేరీస్ స్టెల్లా కాలేజీ ప్రిన్సిపాల్ జసింత, సహాయ, మహిళా
కమిషన్ అధికారులు శైలజ, పూజిత, మాధవి, నాగమణి, కొత్తపల్లి రజిని చౌదరి, వందల
మంది విద్యార్థినీలు ఉత్సహంగా పాల్గొన్నారు.