గుంటూరు : మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల నివారణకు ఇంటర్నల్
కంఫ్లైంట్స్ కమిటీలు ప్రధాన భూమిక పోషిస్తాయని రాష్ట్ర మహిళల, బాలల,
వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖా మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు.
భారత ఉన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన పలు
ఉత్తర్వుల ప్రకారం అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లోను , ప్రైవేటు
కార్యాలయాల్లోనూ ఈ కమిటీలను తప్పని సరిగా ఏర్పాటు చేయాల్సి ఉందని ఆమె
తెలిపారు. గురువారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ
మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆద్వర్యంలో “పని ప్రదేశంలో మహిళలపై లైంగిక
వేధింపుల చట్టం-2013” అమలు తీరు పై జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి
ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతకు, సంక్షేమానికి, సాధికారతకు అధిక
ప్రాధాన్యత నిస్తూ పలు వినూత్న పథకాలను అమలు చేయడం జరుగుచున్నదన్నారు.
మహిళా సాధికారతకు బడ్జెట్ లో కూడా భారీ మొత్తంలో నిధులను మహిళల సంక్షేమం,
అభివృద్దికే కేటాయించడం జరుగుచున్నదన్నారు. ఫలితంగా రాష్ట్రంలోని మహిళలు
ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఆరోగ్య పరంగా అభివృద్ది పథంలో ముందుకు
వెళుతున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంద్రప్రదేశ్ లో మహిళల
ఫిర్యాదులు చాలా తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయని, ఇందుకు జగనన్న ప్రభుత్వం
తీసుకుంటున్న పలు రకాల చర్యలే కారణమని ఆమె పేర్కొన్నారు. అయితే పని చేసే
ప్రదేశంలో మహిళా ఉద్యోగినులపై ఎటు వంటి లైంగిక వేదింపులకు ఆస్కారం లేకుండా
ఉండేందుకై మరియు మహిళలు వారి సమస్యలను నిర్బయంగా వెల్లడిచేసుకునేందుకు
ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలు ప్రధాన వేదికలుగా పనిచేస్తాయన్నారు. ఇంటర్నల్
కంఫ్లైంట్స్ కమిటీలను ఇంత వరకు ఏర్పాటు చేయని శాఖాధిపతులు వెంటనే తమ
కార్యాలయాల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ
స్థాయి వరకూ పనిచేసే మహిళా ఉద్యోగినుల్లో ఈ కమిటీలపై పూర్తి స్థాయిలో అవగాహన
కల్పించాలన్నారు. అదే విధంగా మహిళలకు ప్రత్యేక టాయిలెట్స్, శిశువులకు పాలిచ్చే
ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.