అమరావతి : రాష్ట్రంలోని మహిళల భద్రత, రక్షణకు జగనన్న ప్రభుత్వం అత్యధిక
ప్రాధాన్యత నిస్తున్నట్లు రాష్ట్ర హోమ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ మంత్రి
తానేటి వనిత పేర్కొన్నారు. నిందితులు ఎంతటివారైనా సరే తక్షణ చర్యలు తీసుకోవడం
జరుగుతుందని ఆమె తెలిపారు. మంగళవారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం
నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 12
వ తేదీ అర్థరాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక మైనర్ బాలికపై నేరచరిత్ర
ఉన్న వ్యక్తి దాడిచేసి హత్యచేయడం ఎంతో దురదృష్టకరమైన విషయమన్నారు. మధ్యం
మత్తులోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడటం జరిగిందని, గంజాయి మత్తు ఇందుకు
ఏమాత్రం కారణం కాదని ఆమె తెలిపారు. వ్యక్తిగత గొడవలే ఈ హత్యకు కారణమని
ఆమె స్పష్టం చేశారు. ఈ దుర్ఝటనపై ప్రభుత్వం వెంటనే స్పందించడం వల్ల
నిందితుని ఒక గంటలోపే పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు పంపడం
జరిగిందన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని కూడా రాష్ట్ర
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే ప్రకటించడం జరిగిందని ఆమె తెలిపారు.
అయితే ఈ దురదృష్టకర సంఘటనను ఆధారంగా చేసుకుని ప్రధాన ప్రతిపక్ష పార్టీకి
చెందిన పలువురు నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవాలు లేవని ఆమె
అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలను చేపట్టినప్పటి నుండి
రాష్ట్రంలో మహిళల భద్రతకు, రక్షణకు, సాధికారతకు అధిక ప్రాధాన్యత నిస్తూ పలు
వినూత్న కార్యక్రమాలను, పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.
రాష్ట్రంలోని మహిళల భద్రతకు, రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర
ప్రభుత్వం దిశా చట్టాన్ని రూపొందించి కేంద్రం ఆమోదానికి పంపడం జరిగిందన్నారు.
అదే విధంగా ఆపదలో నున్న మహిళలను వెంటనే రక్షించేందుకు దిశా యాప్ ను కూడా
అమల్లోకి తేవడం జరిగిందని, ఇప్పటి వరకూ 1.30 కోట్ల మంది మహిళలు ఈ యాప్ ను
తమ స్మార్టు ఫోన్లలోకి డౌన్ లోడ్ చేసుకోవడం జరిగిందన్నారు. తొమ్మిది వందలకు
పైబడి మహిళలు ఈ యాప్ ద్వారా ఇప్పటికే రక్షణ పొందడం జరిగిందని తెలిపారు. తప్పు
ఎవరు చేసినా, ఎలాంటి వారు చేసినా ఎటు వంటి పక్షపాతం చూపకుండా 24 గంటల్లోపే
తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. పోలీస్ శాఖ పనితీరుకు ఇదే
నిదర్శనమని ఆమె అన్నారు.