సమాజంలో మహిళ పట్ల ఉన్న చులకన భావంలో మార్పు రావాలి
సోషల్ మీడియా ద్వారా మహిళలను కించపరిచే సంస్కృతికి స్వస్తి పలకాలి
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
అమరావతి : ఏపీ సచివాలయంలో శుక్రవారం మహిళల ఆత్మగౌరవ దినోత్సవం నిర్వహించారు.
మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో
మహిళలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై చర్చించారు. మహిళలు ఆత్మగౌరవంతో
జీవించేలా తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయ మహిళా ఉద్యోగుల సూచనలను మహిళా
కమిషన్ తీసుకుంది. మహిళల ఆత్మగౌరవ దినోత్సవానికి మద్దతుగా సెక్రెటరియేట్‌లోని
మహిళా అధికారులు, ఉద్యోగిణీలు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్
చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం మహిళా ఆత్మగౌరవ
దినం జరుపుకుందామని తెలిపారు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు
పెడుతున్నారని, మహిళలను గౌరవించలేని సమాజం అభివృద్ధి సాధించలేదని అన్నారు.
మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, ప్రతి పథకాన్ని మహిళల పేరు
మీదనే అమలు చేస్తున్నారన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం దిశా యాప్
తీసుకవచ్చిందని తెలిపారు. పవన్‌కు మహిళా కమిషన్‌ను గౌరవించడంలేదని వాసిరెడ్డి
పద్మ మండిపడ్డారు. మహిళా కమిషన్ నోటీసులను ఆయన లైట్ తీసుకున్నారని ఆగ్రహం
వ్యక్తం చేశారు. పవన్ వాలంటీర్లపై దారుణమైన ఆరోపణలు చేశారు కనుకే ఆధారాలు
చూపమన్నామని, వితంతువులు, ఒంటరి మహిళల వివరాలను సంఘ విద్రోహ శక్తులకు
వాలంటీర్లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు. ఒకరిద్దరు తప్పు
చేస్తే వ్యవస్థను రద్దు చేయాలా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై కేసులు
పెట్టి జైలుకు పంపిస్తామని చెప్పారు. తమ పైనా జనసేన కార్యకర్తలు ట్రోల్
చేస్తున్నారని, మరి మీ పార్టీని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. ఇందుకు
పవన్ కళ్యాణ్ బాధ్యులు అంటే ఒప్పుకుంటారా అని నిలదీశారు.
ఈ సందర్బంగా రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ
ప్రస్తుతం మన సమాజంలో సోషల్ మీడియా పిచ్చి పోకడల నేపథ్యంలో ప్రతి శుక్రవారం
మహిళల ఆత్మ గౌరవ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రతి
ఏడాది మార్చి 8 వ తేదీన మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుచున్నదని, అయితే
ఇప్పటి నుండి ప్రతి శుక్రవారం మహిళల ఆత్మ గౌరవ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన
అవసరం ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం సమాజంలో అందుబాటులో ఉన్న అవకాశాలను
అందిపుచ్చుకోవడంలో మహిళలు ఏమాత్రం వెనుకబడి లేరన్నారు. ఆటు కుటుంబాన్ని,
ఇటు ఉద్యోగాన్ని ఎంతో చాకచక్యంతో సమన్వయం చేసుకుంటూ మహిళలు ఎంతో అద్బుతంగా
రాణిస్తున్నారన్నారు. అయితే మద్యయుగాలాంటి మానసిక దోరణిలో నుండి సమాజం బయటకి
రాకపోవడం వల్ల మహిళలు పలు సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి
ఏర్పడుచున్నదన్నారు. పలు రంగాల్లో సమర్థవంతంగా ముందుకు వెళ్లే మహిళలను మరియు
ఎటు వంటి భయం లేకుండా తమ అభిప్రాయాలను వెల్లడించే మహిళలను కించపరిచే విధంగా
చాలా నీచంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టే దోరణి రోజు రోజుకు
పెరిగిపోతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగంగా మహిళలను కించపరిస్తే
ఎవరూ ఊరకోరని, అయితే బయటి సమాజంలో చెల్లని బూతులు, మాటలు సోషల్ మీడియాలో ఎలా
చెల్లుబాటు అవుతాయని ఆమె ప్రశ్నించారు. ఇంట్లో కూర్చోని చేతులోనున్న ఫోను
ద్వారా ఇష్టాను సారం మహిళలను కించపరిచే విధంగా పోస్టింగులు పెట్టే హక్కు
ఎవరికీ లేదనే అంశంపై చర్చ జరగాలనే ఉద్దేశ్యంతోనే ప్రతి శుక్రవారం మహిళల ఆత్మ
గౌరవ దినాన్ని పాటించడం జరుగుచున్నదన్నారు. ఈ విధంగా చర్చ జరగడం ద్వారా
సమాజంలో తప్పక మార్పు వస్తుందని, మహిళలను కించపరిచే వారిని వేలు ఎత్తి చూపే
పరిస్థితి తప్పక ఏర్పతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా సాధికారతకు, మహిళల ఆర్థిక స్వావలంబనకై
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను, కార్యక్రమాలను అమలు చేయడం
జరుగుచున్నదన్నారు. అన్ని రకాల పోస్టుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్
కల్పించడంలోనూ, దిశ యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పించడం లోనూ, ప్రతి పథకం
మహిళల పేరునే మంజూరు చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దైర్యంగా ముందుకు
వెళుతున్నదన్నారు. ఇటు వంటి నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా గానీ, మరే మార్గాల
ద్వారా గాని ఎన్ని ఆటంకాలు ఏర్పడిగా మహిళలు ఏమాత్రం నిరుత్సాహ పడకుండా
ధైర్యంతో ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళల ఆత్మ గౌరవాన్ని
కాపాడేందుకు ప్రతి వారు సహకరించాలని కోరుకుంటూ, ప్రతి శుక్రవారం నిర్వహించే
మహిళల ఆత్మగౌరవ దినోత్సవానికి రాష్ట్ర సచివాలయ మహిళా ఉద్యోగులు అంతా సంతకాలతో
తమ మద్దతను తెలియజేశారు. సచివాలయంలోని మహిళా ఉద్యోగినులు అంతా ఈ కార్యక్రమంలో
పాల్గొన్నారు.