ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా మధ్య కుదిరిన ఒప్పందం
విజయవాడ : గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించి వారు సాధికారత సాధించడంతోపాటు,
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు
ముందుకు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లను ఏర్పాటు
చేసే దిశగా చర్యలు చేపట్టింది. డీ -హైడ్రేషన్ యూనిట్ల ద్వారా ఉల్లి, టమాట,
అల్లం, వెల్లుల్లి, నిమ్మ, బత్తాయి, బీట్రూట్, క్యారెట్, క్యాబేజ్,
మామిడి, పైనాపిల్, పనస వంటి ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడంతోపాటు, ఆయా ఆహార
పదార్థాలు వ్యర్థం కాకుండా ఉంటాయి. బి, సి గ్రేడ్ ఉల్లి, టమాటాలకు సైతం
రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పటికే కర్నూల్ జిల్లా పలు చోట్ల
డీ హైడ్రేషన్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ సానుకూల ఫలితాలు రావడంతో ఏపీ
ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పందం చేసుకుంది.
ఆహార వ్యర్థాలను తగ్గించి, ఉత్పత్తుల విలువ పెరిగేలా చర్యలు : ఉల్లి, టమాటా
రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధర, పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన
లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును
ప్రోత్సహిస్తున్నట్టు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎస్‌ఎఫ్‌పీఎస్)
సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు
కింద ఏర్పాటు చేసిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో రాష్ట్ర మొత్తం యూనిట్లను
విస్తరించాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో
రూ. 84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని ఏపీఎస్‌ఎఫ్‌పీఎస్
సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
రైతులకు జరిగే మేలు ఇలా : ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం విజయవాడలో ఏపీ
ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మధ్య అవగాహన ఒప్పందం
జరిగింది. సొసైటీ సీఈవో శ్రీధర్‌రెడ్డి, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) డీజీఎం
చందన్ సాహూ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ
ఒక్కో యూనిట్ అంచనా వ్యయం రూ.1.68 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టు
వ్యయంలో ప్రభుత్వం 35 శాతం (రూ.29.40కోట్లు) రాయితీని భరిస్తుందని,
లబ్ధిదారులు 10 శాతం (రూ.8.40 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందన్నారు. మిగిలిన 55
శాతం (రూ.46.20 కోట్లు) బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఈ
యూనిట్లు అందుబాటులోకి వస్తే.. రైతులకు నష్టాలు తగ్గుతాయని అన్నారు. గ్రామీణ
మహిళా సాధికారతే దీని ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. కర్నూలులో పైలెట్
ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన యూనిట్ల ద్వారా ఒక్కో మహిళ సగటున రూ.12 వేల నుంచి
రూ.18 వేల వరకు అదనపు ఆదాయాన్ని పొందుతున్నట్లు చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో
3,500 యూనిట్లు, మిగిలిన జిల్లాల్లో మరో 1,500 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు
చెప్పారు. బ్యాంక్ డీజీఎం చందన్ సాహూ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు గ్రామీణ మహిళల
ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టులకు
ఆర్థిక చేయూతనిచ్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు బ్యాంక్
సిద్ధంగా ఉందన్నారు. ఏపీఎస్‌ఎఫ్‌పీఎస్ స్టేట్ లీడ్ కె.సుభాష్ కిరణ్
మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ
మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మద్దతుగా
ఉందని, ప్రధానంగా వ్యవసాయ రంగంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.