అంత్యక్రియలు
తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి అల్లూరి కృష్ణంరాజు
కృష్ణంరాజు పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను
: బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి
చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ
విజయవాడ : ప్రజాసేవనే పరమావధిగా భావించి నిజాయితీగా రాజకీయాలను చేసిన వ్యక్తి,
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రాజోలు మాజీ శాసన సభ్యులు అల్లూరి కృష్ణంరాజు
ఈరోజు సాయంత్రం 5.30 గం.లకు అనారోగ్యంతో పరమపదించడం తీరని లోటు అని బీసీ
సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన
శ్రీనివాస వేణు గోపాల కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత, మాజీ
ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి, వారి కుటుంబానికి తనను పరిచయం చేసిన
రాజకీయ జీవిత ప్రదాతను కోల్పోవడం బాధాకరమన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే
తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి అల్లూరి కృష్ణంరాజు అని
వెల్లడించారు. ఆయన మరణించారన్న వార్త తెలిసిన వెంటనే తనతో పాటు తమ కుటుంబ
సభ్యులు కుంగిపోయామన్నారు. వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగిన తాను, తన
తండ్రి సమానులైన ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి
శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అల్లూరి కృష్ణంరాజు అంటే ఎనలేని గౌరమన్నారు.
అల్లూరి మరణంతో ముఖ్యమంత్రి చలించిపోయారన్నారు. వారి కుటుంబ సభ్యులకు
ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారన్నారు. ప్రభుత్వ అధికార
లాంఛనాలతో అల్లూరి కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి
తెలిపారన్నారు. రాజోలుతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో
పేరెన్నికగన్న వ్యక్తి అల్లూరి కృష్ణంరాజు అని కొనియాడారు. ఆయనంటే గోదావరి
జిల్లాల ప్రజలకు ఎనలేని గౌరవమన్నారు. తాను గొప్ప విలువలతో రాజకీయం చేస్తానని
నమ్మి తనను రాజకీయాలకు పరిచయం చేసిన వ్యక్తి ఆయన అన్నారు. రాజకీయాల్లో
నిజాయితీ, ప్రజాసేవనే ఆస్తిగా భావించాలని తనకు హితబోధ చేసిన వ్యక్తి అల్లూరి
కృష్ణం రాజు అన్నారు. రారాజులా వెలిగిన వ్యక్తి, దయాహృదయుడు, పేదలకు ఎనలేని
సేవలందించిన వ్యక్తిగా చిరంజీవిగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. అల్లూరి మరణంతో
తమ ప్రాంతం, తాము పెద్దదిక్కును కోల్పోయామన్నారు. రాష్ట్ర మంత్రిగా తాను ఈ
స్థితిలో ఉండటానికి మొదటి విత్తనం వేసిన గొప్ప వ్యక్తి అల్లూరి అని
కొనియాడారు. సఖినేటిపల్లి లో ఉదయం 7గం.ల నుండి ప్రజల సందర్శనార్థం
పార్థీవదేహాన్ని ఉంచుతారని తెలిపారు. అనంతరం రాజోలు నియోజకవర్గం సోంపల్లి వరకు
అంతిమయాత్రగా తీసుకెళుతారని వెల్లడించారు. అనంతరం ప్రభుత్వ అధికార లాంఛనాలతో
అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ
అన్నారు.