హైదరాబాద్ : రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టిఫా యంత్రాల ద్వారా ప్రతి నెల
20వేల మంది గర్భిణీలకు స్కానింగ్ చేసే వెసులుబాటు కలగనుందని తెలంగాణ
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఆ సేవలను ప్రైవేట్
ఆస్పత్రుల్లో పొందాలంటే రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వెచ్చించాల్సి వస్తుందని
తెలిపారు. రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం మూడంచెల
వ్యూహాన్ని అమలు చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్
ఫర్ ఫీటల్ అనామలీస్) స్కానింగ్ మిషన్లను శనివారం ఆయన వర్చువల్‌గా
ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆసుపత్రిలో హోంశాఖ మంత్రి మహమూద్
అలీ టిఫా స్కానింగ్ మిషన్లను నేరుగా ప్రారంభించారు. ప్రసవానికి ముందు
ఏఎన్సీ, 102 అమ్మ ఒడి వాహనాల సేవలు, ప్రసవ సమయంలో డెలివరీలు, ఎంసీహెచ్
కేంద్రాలు, ఐసీయూ, ఎస్ఎన్సీయూల సేవలు, ప్రసవం తర్వాత.. 102 వాహన సేవలు,
కేసీఆర్ కిట్స్, చైల్డ్ ఇమ్యునైజేషన్ సేవలు అందిస్తున్నామని హరీశ్‌రావు
వివరించారు. ఈ విధంగా కేసీఆర్ కిట్‌లో నమోదైన గర్భిణీలకు మూడంచెల వ్యవస్థలో
సేవలు అందిస్తున్నామని తెలిపారు. గర్బిణీలకు తప్పనిసరిగా నాలుగు సార్లు
ఏఎన్సీ పరీక్షలు చేస్తున్నామన్నారు. మాతా శిశు సంరక్షణలో విప్లవాత్మకమైన
మార్పునకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ కిట్ పథకాన్ని పేట్ల బురుజు ప్రసవ
ఆసుపత్రి వేదికగా సీఎం కేసీఆర్ ప్రారంభించారని.. అదే వేదికగా మరో
కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వైద్య సిబ్బంది కృషితో
రెండు నెలల్లోపే ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాటయ్యాయని
పేర్కొన్నారు.
పుట్టబోయే పిల్లల్లో లోపాలను గర్భంలో ఉండగానే గుర్తించేందుకు టిఫా స్కాన్
దోహదం చేస్తుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తాజాగా ప్రారంభించిన యంత్రాలతో
ప్రతి నెల సగటున 20వేల మంది గర్భిణీలు ఈ సేవలు ఉచితంగా వినియోగించుకునే
వెసులుబాటు కలుగుతుందన్నారు. ఆ సేవలను ప్రైవేట్ ఆస్పత్రుల్లో పొందాలంటే రూ.2
వేల నుంచి రూ.3 వేల వరకు వెచ్చించాల్సి వస్తుందన్నారు. నిపుణులైన
రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులు స్కానింగ్ చేస్తారని వెల్లడించారు. శిశువు
గర్భంలో ఏ స్థితిలో ఉంది? జరాయువు ఏ ప్రాంతంలో ఉంది? ఉమ్మ నీరు స్థితి వంటి
వాటిని టిఫాతో గుర్తిస్తారని చెప్పారు. అంతర్జాతీయ నివేదికలు, వైద్య నిపుణుల
గణాంకాల ప్రకారం పుట్టిన శిశువుల్లో 7శాతం లోపాలు ఉంటాయని, ప్రతి 100 మందిలో
ఏడుగురికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండే అవకాశం ఉంటుందని మంత్రి హరీశ్‌రావు
తెలిపారు. వాటిని టిఫా మిషన్లతో ముందే గుర్తించవచ్చన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లను హోం
మంత్రి మహమూద్ అలీ తో కలిసి వర్చువల్ గా ప్రారంబించిన ఆర్థిక, వైద్యారోగ్య
మంత్రి హరీశ్ రావు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ ఆరోగ్య
సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్
రెడ్డి, టి వి వి పి కమిషనర్ అజయ్ కుమార్, పెట్ల బురుజు ఆసుపత్రి
సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి, మెటర్నల్ హెల్త్ జెడి డాక్టర్ పద్మజ, ఉస్మానియా
మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శశికళ తదితరులు పాల్గొన్నారు.