రాష్ట్రానికి మరో రెండు జాతీయ అవార్డులు
హై రిస్క్ కేసుల గుర్తింపులో దేశంలోనే రెండో స్థానం
మిడ్ వైఫరీ వ్యవస్థకు ప్రత్యేక అవార్డు, ప్రశంస
హర్షం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు
హైదరాబాద్ : మాతా శిశు సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు
జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు మన రాష్ట్రం
అనుసరిస్తున్న విధానాలు ఉత్తమమైనవని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కేంద్ర
వైద్య ఆరోగ్యశాఖ ఢిల్లీలో నిర్వహిస్తున్న “నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్ షాప్”
కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు రెండు అవార్డులను ప్రకటించింది. మాతృ మరణాలను
పూర్తిగా నివారించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య
శాఖ తీసుకుంటున్న చర్యలను కేంద్రం అభినందించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన
కార్యక్రమంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్
పవార్ చేతులమీదుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాయింట్ డైరెక్టర్ (మెటర్నల్
హెల్త్) డాక్టర్ ఎస్ పద్మజ అందుకున్నారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ వైఫరీ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు
కురిపించింది. ఈ విధానంతో నాణ్యమైన ప్రసవ సేవలు గర్భిణులకు మరింతగా
చేరువైనట్టు పేర్కొంది. రాష్ట్రంలో ప్రసవసేవలను మరింత మెరుగుపరిచేందుకు
ప్రభుత్వం దేశంలోనే తొలి సారి మిడ్ వైఫరీ వ్యవస్థను తీసుకువచ్చింది. ఎంపిక
చేసిన నర్సులకు అత్యుత్తమ శిక్షణ అందించింది. ఇప్పటివరకు ఇలా శిక్షణ పొందిన
212 మంది మిడ్ వైఫరీలను ప్రభుత్వం 49 హాస్పిటల్లలో నియమించింది. వీరు
గర్బిణులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, వ్యాయామం చేయించడంతో పాటు, మానసికంగా సంసిద్ధం
చేయిస్తున్నారు. ప్రస్తుతం మరో 141 మంది శిక్షణ పొందుతున్నారు. వీరు త్వరలోనే
అందుబాటులోకి రానున్నారు. ఈ విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇక
హైరిస్క్ ఉన్న గర్భిణులను గుర్తించడం, చికిత్స అందించడంలో తెలంగాణ దేశంలోనే
రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. మాతృ మరణాలను
పూర్తిగా తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం
“ఎండింగ్ ప్రివెంటబుల్ మెటర్నల్ మోర్టాలిటీ” ప్రోగ్రాం ను అమలు చేస్తోంది.
హై రిస్క్ గర్భిణులను ముందస్తుగా గుర్తించడం, వారిని నిరంతరం పరిశీలించడం (
ట్రాకింగ్), ఉత్తమ చికిత్స అందేలా రిఫర్ చేయడంకోసం వైద్య అధికారులు, స్టాఫ్
నర్సులు, ఏఎన్ఎం లతో ప్రత్యేక విధానాన్ని అభివృద్ధి చేసింది. వారికి ప్రత్యేక
శిక్షణ ఇచ్చింది. దీంతో హై రిస్క్ కేసులను ముందుగా గుర్తించి, వారి
ఆరోగ్యాన్ని పర్యవేక్షించి, ఆసుపత్రులకు తరలించి, సరైన చికిత్స అందించే అవకాశం
కలిగింది. దీంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహన
సేవలు గర్భిణులకు వరంగా మారాయి. ఫలితంగా రాష్ట్రంలో మాతృ మరణాలు గణనీయంగా
తగ్గాయి.
హర్షం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు…
సీఎం కేసీఆర్ ఆలోచనతో రాష్ట్రంలో అమలు చేస్తున్న మాతా శిశు సంరక్షణ చర్యలు
సత్ఫలితాలిస్తున్నాయి. మరో రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు రావడం మా వైద్య
సిబ్బంది పనితీరుకు నిదర్శనం. మాతృ మరణాలు తగ్గించడంలో మన పురోగతిని ఇటీవల
శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే కూడా వెల్లడించింది. 2014లో 92 గా ఉన్న ఎంఎంఆర్
ఇప్పుడు 43కు తగ్గటం గొప్ప విషయం. ఈ ఘనతలు సాధించడంలో క్షేత్రస్థాయిలో ఉండి
వైద్య సేవలు అందించే ఆశాలు, ఏఎన్ఎంల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి
వైద్యాధికారుల నిరంతర కృషి ఉంది. అందరికి అభినందనలు. శుభాకాంక్షలు.