మౌలిక వసతుల కల్పన, సమగ్ర శిక్షణ విషయంలో ముందంజ
ప్రజారోగ్య పరిరక్షణలో క్షేత్ర స్థాయి సిబ్బంది భాగస్వాములు కావాలి
కార్యక్రమాల్ని కిందిస్థాయి వరకూ చేరవేయగలిగితేనే సార్ధకత
మెడికల్ ఆఫీసర్లకు మాస్టర్ ట్రయినర్లుగా రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కమీషనర్ నివాస్
జిల్లాకు నలుగురు మెడికల్ ఆఫీసర్లు చొప్పున 26 జిల్లాల మెడికల్ ఆఫీసర్లకు రెండు రోజుల శిక్షణ
ఐదు అంశాలపై అవగాహన కలిగించేందుకు తయారు చేసిన ఫ్లిప్ చార్టుల్ని ఆవిష్కరించిన నివాస్
సిహెచ్వోలకు జిల్లా స్థాయిలో ఇదే తరహాలో శిక్షణివ్వడం ద్వారా ఆశించిన ఫలితాల్ని సాధించాలి
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్
విజయవాడ : మాతా, శిశు సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెరుగైన ఫలితాల్ని సాధించిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ జె.నివాస్ అన్నారు. విజయవాడ హోటల్ మురళీ ఫార్చ్యూన్ లో బుధవారం ఏపీ నేషనల్ హెల్త్ మిషన్, నూరా హెల్త్ సంయుక్తంగా ‘కేర్ కంపేనియన్ ప్రోగ్రాం’ పేరిట నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని నివాస్ ప్రారంభించారు. జిల్లాకు నలుగురు చొప్పున 26 జిల్లాల మెడికల్ ఆఫీసర్లకు రెండు రోజుల పాటు మాస్టర్ ట్రయినర్లుగా శిక్షణ ఇస్తారు. ఇందుకు సంబంధించి ఐదు అంశాలపై రూపొందించిన ఫ్లిప్ చార్టుల్ని ఈ సందర్భంగా నివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో మౌలిక వసతుల కల్పన, సమగ్ర శిక్షణ విషయంలో ఏపీ ముందంజలో ఉందన్నారు. అదే విధంగా మాతా శిశు ఆరోగ్య పరిరక్షణలో కూడా ఆంధ్ర ప్రదేశ్ ముందు నిలిచిందన్నారు. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన వైద్యాధికారులు క్షేత్ర స్థాయిలో సిహెచ్వోలు/ఎఎన్ ఎంలకు ఉపయోగపడేలా జిల్లా స్థాయిలో శిక్షణివ్వాలని నివాస్ సూచించారు. గర్భిణిలు ప్రసవానికి ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాంక్రమిక వ్యాధులు, చంటి పిల్లలు, కిషోర బాలికల ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై ఈ శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాల్ని సాధించాలన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చిత్తశుద్ధితో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయిలో ఎలాంటి కార్యక్రమాల్ని చేపట్టినా కింది స్థాయి వరకూ చేరుకోగలిగితేనే వాటికి సార్ధకత చేకూరుతుందన్నారు. కేర్ కంపానియన్ ప్రోగ్రామ్ శిక్షణతో, ఆరోగ్య సంరక్షణ ప్రదాతల ద్వారా పౌరులకు సాధారణ అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. గర్భిణిలు, సంరక్షకుల (కుటుంబ సభ్యులు) నిరీక్షణ సమయాన్ని ఉపయోగించడం ద్వారా లక్షణాలు, సాధ్యమయ్యే సమస్యలు మరియు స్టాఫ్ నర్సులకు శిక్షణ ఇవ్వడం, వెయిటింగ్ హాల్‌లను తరగతి గదులుగా మార్చడం ద్వారా వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై వారికి సలహా ఇవ్వడానికి ఓపి సమయాన్ని ఉపయోగించుకోవడం అనే అంశాలతో సిపిపిని రూపొందించబడిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమం వారి కోలుకునే వ్యవధిలో వారితో పాటు సంరక్షకులు , తల్లులకు, శిక్షణ, అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కాన్సెప్ట్‌ను మొదట ఎంసిహెచ్ విభాగంలో ప్రవేశపెట్టారని, తరువాత రాష్ట్రవ్యాప్తంగా 260 ఆసుపత్రులలో విస్తరించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ ఆరోగ్య మిషన్ మరియు సమాజంలోని వివిధ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి నూరా హెల్త్ నుండి సాంకేతిక మద్దతుతో పాటు ఈ ప్రోగ్రాం విస్తరణకు ప్రణాళికను రూపొందించామన్నారు. మొత్తం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి మరియు నవజాత శిశువుల ఆరోగ్యం, పిల్లలు మరియు కౌమార బాలికల ఆరోగ్యం, అసాంక్రమిక వ్యాధుల వంటి ఐదు అంశాలపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారిస్తుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఈ ఐదు ఆరోగ్య అంశాలలో నివారణా చర్యలు తీసుకోవడానికి మరియు మెరుగైన ఆరోగ్య సూచికల కోసం ప్రవర్తనా మార్పుపై ప్రజలకు మద్దతునిచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేస్తారన్నారు. కేర్ కంపానియన్ ప్రోగ్రాం ద్వారా చిన్నారులు మరియు కౌమార బాలల ఆరోగ్యం, ప్రసూతి ఆరోగ్యం (గర్భిణిల ప్రసవానికి ముందూ , తర్వాత), అసాంక్రమిక వ్యాధులు వంటి ఐదు ప్రధాన అంశాలపై కేంద్రీకృతమైన బోధనా విధానాల్ని రాష్ట్రం అమలు చేస్తోందన్నారు. క్షేత్ర స్థాయిలో టార్గెటెడ్ గ్రూపుల దృష్టిని ఆకర్షించడానికి ఫ్లిప్ చార్టులు చాలా శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన సాధనంగా ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తు జగనన్న ఆరోగ్య సురక్ష ప్రచార శిబిరాల (జెఎఎస్ క్యాంపులు)ద్వారా ఆరోగ్య పరిరక్షణపై సమాజంలో అవగాహన కల్పించడానికి, ఆయా విధానాలను వ్యాప్తి చేయడానికి ఎన్సీడి ఫ్లిప్ చార్టులు విస్తృతంగా ఎలా ఉపయోగపడుతున్నాయో నివాస్ నొక్కి చెప్పారు. రాష్ట్ర స్థాయి శిక్షణా (మాస్టర్ ట్రైనర్స్) వైద్య అధికారుల కోసం రాష్ట్ర స్థాయి శిక్షణతో వైద్య అధికారులు అన్ని జిల్లాల్లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు (సిహెచ్ ఓలు) శిక్షణనిచ్చి, కార్యక్రమం విశిష్టతను తెలియజేయాలనీ , ఆ దిశగా వారిని ప్రేరేపించి తగిన అవగాహన కల్పించాలనీ కోరారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం, జగనన్న ఆరోగ్య సురక్ష మరియు హెల్త్ మేళాలు వంటి కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు.
ప్రజారోగ్య ప్రయోజనాల కోసం ప్రతి మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సమానంగా భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హెల్త్ మిషన్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ దుప్పల వెంకట రవికిరణ్, నూరా హెల్త్ మెడికల్ డైరెక్టర్ (బెంగళూరు) డాక్టర్ సుదీప్, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ తన్మయ్, ట్రయినింగ్ లీడ్ డాక్టర్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.