కొవ్వూరు : తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, తల్లి కడుపులోని బిడ్డ నుండి వృద్ధురాలి వరకు అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూరుతోందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. శుక్రవారం నల్లజర్లలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల నందు జరిగిన మండల స్థాయి వైఎస్సార్ ఆసరా సంబరాల్లో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మండలంలో 1621 డ్వాక్రా గ్రూపులకు 16208 మంది డ్వాక్రా మహిళలకు 15 కోట్ల 38 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం మహిళల మధ్యలోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటోకి డ్వాక్రా మహిళలతో కలిసి పాలాభిషేకం చేసారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… మహిళ సాధికారిత ఒక జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమన్నారు. గత ప్రభుత్వం మహిళలను నమ్మించే మాటలు చెప్పి మోసం చేసిందని, మీ బంగారాన్ని, మీ డ్వాక్రా రుణాలను రద్దు చేసి ఇస్తామని చెప్పి రుణాలు మాఫీ చెయ్యక పొగా తిరిగి వారికే నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నాలుగు దఫాలుగా రుణ మాఫీ చేశారన్నారు. అలాగే ప్రతీ మహిళను వారి కాళ్లపై వారిని నిలబెట్టేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రజలకు అనేక పథకాలు తీసుకువచ్చామన్నారు. జగనన్న పరిపాలనా కాలంలో రెండేళ్లు కరోనాతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఎక్కడా సంక్షేమం ఆగకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. దేశంలో ఎక్కడా, ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేయటం లేదని తెలిపారు. బ్యాంకులకు నగదు కట్టలేక ఇబ్బందులు పడుతున్న మహిళలకు ఆసరా పథకం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. ఆడపడుచులకు పుట్టింటి కానుకగా 31 లక్షల మందికి ఇల్లు పట్టాలు మహిళల పేరుమీదనే ఇచ్చామన్నారు. విద్య, వైద్య రంగంలో ముఖ్యమంత్రి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ఏపీని ఆదర్శంగా తీసుకుని అనేక రాష్ట్రాలు పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మహిళలు ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని హోంమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.