మానవత్వమే నాకు ముఖ్యం : రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు
విజయవాడ : కులం, మతం, ప్రాంతం అనే తేడా నాకు లేదు. కేవలం మానవత్వమే నాకు
ముఖ్యమని రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు అన్నారు. విజయవాడ లోని
తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆయన రాసిన “సంకెళ్లు తెంచుకుంటూ”
పుస్తక ఆవిష్కరణ మంగళవారం జరిగింది. ఈ పుస్తకాన్ని డాక్టర్ జి. సమరం లాంఛనంగా
ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి పీవి రమేష్
అధ్యక్షతన జరిగింది. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు
అర్పించారు. సంకెళ్లు తెంచుకుంటూ పుస్తక ఆవిష్కరణ అనంతరం తొలికాపీని దివంగత
దళిత రోహిత్ తల్లి రాధికకు అందజేసారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ
పేదవాళ్లు ఉంటేనే దొరలుంటారు.కాబట్టే సమాజంలో పేదరికం ఎప్పుడూ అలానే ఉండాలని
ఉన్నతవర్గాలు కోరుకుంటాయన్నారు. సమాజంలో కులవివక్షత ప్రాచుర్యంలో ఉన్న సమయంలో
తాను చదువుకోడానికి తన తల్లే మార్గదర్శకమన్నారు. నాన్న పెద పాలేరుగా పనిచేస్తూ
తమను కూడా అదే వృత్తిలో కొనసాగాలని తమపై వత్తిడి తీసుకురాగా అందుకు భిన్నంగా
మానాన్నతో పోరాటం చేసి నన్ను చదివించిందన్నారు. నీ వృత్తిలో నీవు నిజాయితీగా
ఉండు, కష్టపడు, నీ ప్రతిభతోనే పై స్థాయిలోకి రమ్మని, నీవు వచ్చిన జీవితాన్ని
మర్చిపోకుండా పేదవాళ్లు సాయం చేయమని చెప్పిన తన తల్లి మాటలను అనుసరిస్తూ
వచ్చానన్నారు. తనను మెచ్చుకున్న సీఎంలు ఉన్నారు. తనపట్ల పరుషంగా మాట్లాడిన
సీఎంలూ ఉన్నారని అయితే ఎవరు ఏమనుకున్నా తాను కార్యదర్శిగా విలువలతో కూడిన
సలహాలను మాత్రమే వారికి ఇస్తూ వచ్చానన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన
డాక్టర్ జి సమరం మాట్లాడుతూ జాషువా సాహిత్యాన్ని అవపోసన పట్టిన వ్యక్తి కాకి
మాధవరావు అన్నారు. ఆయన సాహిత్య పిపాసి ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
విశ్వనరుడు గుర్రం జాషువా సాహిత్యాన్ని నమ్మి ఆయన రాసిన గబ్బిలం ఒక
పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించారని తెలిపారు. పరిపాలనాదక్షత కలిగిన
మహోన్నతమైన వ్యక్తి కాకి మాధవరావు అని తెలిపారు. మనిషిని మనిషిగా చూసే
వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని ఆయన అన్నారు. ఆయన రాసిన ఈ పుస్తకం ఒకనాటి కథ
అని దీనికి అనుసంధానంగా ఈనాటి కల, రేపటి అల అనే పుస్తకాలను కూడా రాయడం మంచిదని
సూచించారు. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కె సునీత, ఎన్టీఆర్ జిల్లా
కలెక్టర్ ఢిల్లీరావు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిమ్మగడ్డ సురేంద్రబాబు,
నిమ్మగడ్డ అనురాధ, ఎంఎం నాయక్, సుధీర్, ద్వారకా తిరుమల రావు, ముద్దాడ
రవిచంద్ర, విజయకుమార్ తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించిన వారిలో ఉన్నారు.