అమరావతి : మానసిక, శారీరక ఉల్లాసం, ఉత్సాహాంతో పాటు ఆరోగ్యానికి క్రీడలు
ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్
రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ క్రీడలను తమ జీవితాల్లో ఒక
భాగంగా చేసుకొని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు
సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం
ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవ
కార్యక్రమం శుక్రవారం అమరావతి సచివాలయం ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
డా.కె.ఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ ధేశ ప్రజల్లో క్రీడా స్పూర్తితో పాటు
ఆరోగ్య , ఆహ్లదకర పరిస్థితులను పెంపొందించేందుకు భారత ప్రభుత్వం వారు కూడా
ఫిట్ ఇండియా క్యాంపైన్ పేరుతో అనేక క్రీడా పోటీలను నిర్వహించడం
జరుగుచున్నదన్నారు. క్రీడలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక భాగం చేసుకుని
వారానికి కనీసం నాలుగైదు రోజులైనా శారీర శ్రమ కల్పించే విధంగా క్రీడలను
అభ్యసిస్తుంటే రోగాలు దరిచేరవని, వైద్యులను ఆశ్రయించే పరిస్థితులు
ఏర్పడవన్నారు. అధిక బరువు, బి.పి., డయాబెటిస్ వంటి నాన్-కమ్యునికబుల్ డిసీజెస్
వల్ల ప్రతి ఏడాది 65 శాతం మరణాలు సంభవిస్తున్నాయని ఒక నివేదికలో
వెల్లడైందన్నారు. ఈ ఆధునిక యుగంతో చాలా మంది దైనందిక జీవితం ఆరుబయట గడపటమే
తగ్గిపోయిందని, రోజుకు కనీసం ఒక గంటపాటైనా సూర్యరశ్మి తగిలే విధంగా ఆటలు ఆడటం,
యోగాసనాలు అభ్యసించడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, నాన్-కమ్యునికబుల్ డిసీజెస్
కూడా దరిచేయకుండా జీవితాలు ఎంతో ఉల్లాసంగా, ఉత్సహాంగా సాగుతాయన్నారు. ఇటు వంటి
క్రీడా పోటీలను ఉద్యోగులకు తరచుగా నిర్వహించడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగులు మంచి ఉత్సాహంతో, ఉల్లాసంతో ఎంతో అంకిత భావంతో తమ విధులను
నిర్వహించేందుకు కూడా ఇటు వంటి క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రతి
ఒక్కరూ తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని, ఉద్యోగులు
కాలానుగుణంగా ఆరోగ్య పరీక్షల చేయించుకునే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు
ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సచివాలయం
ఉద్యోగుల సంఘం అద్యక్షులు కె.వెంకటరామి రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు అంతా
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్. జవహర్ రెడ్డిని ఘనంగా
సత్కరించారు. తదుపరి పలు క్రీడా విభాగాల్లో గెలుపొందిన విజేతలకు రాష్ట్ర
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి బహుమతులను, షీల్డ్సును
అందేస్తూ అభినందించారు. రాష్ట్ర యువజనాభివృద్ది, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి
వాణీమోహన్, రాష్ట్ర సచివాలయం ఉద్యోగుల సంఘం అద్యక్షులు కె.వెంకటరామి రెడ్డి
తదితరులతో పాటు సచివాలయ ఉద్యోగులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.