ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయా జిల్లాలకు చెందిన
ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు
ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో ఇంటరాక్ట్ అయిన ముఖ్యమంత్రి
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం భీమవరం నుంచి వీడియో
కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఎంపీ గొడ్డేటి మాధవి, అరుకు ఎమ్మెల్యే చెట్టి
ఫల్గుణ, కలెక్టర్ సుమిత్ కుమార్
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం సుబ్బులు గ్రామం నుంచి పాల్గొన్న
పాడేరు ఎమ్మెల్యే కొట్టుగుళ్లు భాగ్యలక్ష్మి, పాడేరు ఐటీడీఏ, పీఓ వి అభిషేక్,
ఇతర అధికారులు
పార్వతీపురం మన్యం జిల్లా సికల్బాయి గ్రామం నుంచి పాల్గొన్న కురుపాం
ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, కలెక్టర్ నిషాంత్ కుమార్
గుంటూరు : రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, ఒకేసారి 100 జియో
టవర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. క్యాంపు
కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. దీని ద్వారా 209 మారుమూల
గ్రామాలకు సేవలు అందనున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు,
పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు,
వైయస్సార్ జిల్లాలో 2 టవర్లను సీఎం ప్రారంభించారు. టవర్లను ఏర్పాటు చేసిన
రిలయన్స్ జియో సంస్థ భవిష్యత్తులో 5జీ సేవలను అప్గ్రేడ్ చేయనుంది. కొత్తగా
ప్రారంభించిన సెల్టవర్ల వల్ల మారుమూల ప్రాంతాలనుంచి ఆయా జిల్లాలకు చెందిన
ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో వీడియో
కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో సీఎం జగన్
ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ప్రాజెక్టు కింద కొత్తగా 2,704 ప్రాంతాల్లో టవర్ల
ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే 2,363 చోట్ల స్థలాలు ప్రభుత్వం
అప్పగించింది. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటుకు
ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ అభినందనలు.
కేంద్ర ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి, జియోకు, ఎయిర్టెల్,
బీఎస్ఎన్ఎల్ అందిరికీ ధన్యవాదాలు. డిసెంబరు నాటికి రాష్ట్రంలో సెల్
సర్వీసులు లేని ఆవాసాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పెద్ద ఎత్తున మార్పులు
రానున్నాయి. దీంతో అన్ని సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్,
స్కూళ్లకూ ఇంటర్నెట్ కనెక్షన్ లభిస్తుంది. రేషన్ పంపిణీ, ఇ–క్రాప్
బుకింగ్ కూడా సులభమవుతుంది. మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును అత్యంత
పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా అక్కచెల్లెమ్మలకు అందించగలుగుతాం.
అదే విధంగా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ప్రజాప్రతినిధులకు,
అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ టవర్స్
ఏర్పాటు వల్ల మీ అందరికీ ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి చేసే
పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.
మొబైల్ టవర్లను ప్రారంభించిన సిఎం : పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్మాణం
పూర్తయిన మొబైల్ టవర్లను ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో
ప్రారంభించారు. గుమ్మలక్ష్మీపురం మండలం సికలబాయి, పాచిపెంట మండలం కుంటంబడేవలస
గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా గ్రామస్తులు పెద్ద ఎత్తున
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ టవర్ల ఏర్పాటుతో డిజిటల్
విప్లవం వచ్చి గొప్ప మార్పుకు నాంది పలకనుందని అన్నారు. దీనితో ఇంకా మంచి
జరగాలని ఆయన ఆకాక్షించారు. డిసెంబరు నాటికి అన్ని టవర్ల నిర్మాణం పూర్తి
చేయాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ మొబైల్
టవర్ల ఏర్పాటుతో జిల్లాలో నూతన శకం ప్రారంభం అవుతుందని అన్నారు. జిల్లా
వ్యాప్తంగా 4జి కవరేజ్ వస్తుందన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఏర్పాటు
చేయాల్సిన 52 టవర్లను ఒకేసారి అటవీ అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. ఒక్కో
టవరు ఏర్పాటుకు రూ.80 లక్షలు వరకు ఖర్చు చేయడం జరుగుతుందని, తద్వారా జిల్లాలో
రూ.135 కోట్ల విలువ చేసే టవర్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతీ టవర్
నుండి అర కిలో మీటర్ నుండి 1.50 కిలోమీటర్ల దూరం వరకు సిగ్నల్స్ అందుతున్నాయని
ఆయన పేర్కొన్నారు.
శాసన సభ్యులు పాముల పుష్ప శ్రీ వాణి మాట్లాడుతూ గిరిజన ప్రాంతం విద్యా, వైద్యం
వంటి ప్రాథమిక అవసరాలకు కూడా దూరంగా ఉందని, కమ్యూనికేషన్ కు మరింత దూరంగా
ఉన్నామన్నారు. గిరిజన అభివృద్ధికి కట్టుబడిన ముఖ్యమంత్రిగా, ప్రతి ఆలోచన
గిరిజనుల అభివృద్ధి పైనే ఉండటం సంతోషదాయకం అన్నారు. నాడు నేడు పనులతో
పాఠశాలలు, ఆసుపత్రుల రూపు రేఖలు మార్చారని అన్నారు. పథకాలతో గుండె గుండెకు
చేరువ అయ్యారని ఆమె పేర్కొన్నారు. మొబైల్ వినియోగదారులలో పాలక సంధ్య
మాట్లాడుతూ మేము అనుభవిస్తున్న కష్టాలు తీర్చేవారు లేరు అనుకున్నామని, నేను
ఉన్నాను అంటూ మీరు వచ్చి అండగా ఉన్నానని నిరూపించారని అన్నారు. టవర్లను ఇచ్చి
బయటి ప్రపంచానికి పరిచయం చేశారని చెప్పారు. పాఠశాలలలో పిల్లలను చేర్పించే
సమాచారం ఫోన్ కు వస్తుందని అన్నారు. టవర్ల రాకతో సిగ్నల్స్ అందాయని పాఠశాలకు
ఉపాధ్యాయులు ఎన్ని గంటలకు వస్తారో అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు. ప్రపంచం
జరిగే వార్తలు ఎప్పటికప్పుడు తెలుస్తుందని అన్నారు. గతంలో గర్భిణీలు ప్రసవ
సమయంలో ఏమి చేయాలో తెలిసేది కాదని, అంబులెన్సుకు పిలుచుకు వచ్చేసరికి ప్రసవం
జరిగి పోయేదని… ఇప్పుడు 108కి ఫోన్ చేస్తున్నామని, కొద్ది సమయంలో వచ్చి
ఆసుపత్రిలో చేర్చుతుందని, మరి కొద్ది సేపటికి తల్లీబిడ్డల క్షేమ సమాచారం ఫోన్
లో తెలుస్తుందని వివరించారు. ప్రతీ విషయానికీ చేదోడు వాదోడుగా మీరు ఉన్నారనే
ధైర్యం మాకు కలిగిందని అన్నారు. పింఛన్ల పంపిణీకి సిగ్నల్స్ ఎంతో ఉపయోగ
పడుతుందని, కొత్త జిల్లాగా పార్వతీపురం ఏర్పాటు చేసి అనేక వ్యయ ప్రయాసలను
తగ్గించారని అభినందించారు.