మరింత దిద్దుబాటలో మాల్దీవులు
మంత్రుల వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టీకరణ
భారత హైకమిషనర్ భేటీలో వివరణ
బీజింగ్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పరిసరాలపై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై చైనా స్పందిస్తూ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. మాల్దీవులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న డ్రాగన్ భారత్ మరింత విశాల దృక్పథంతో ఆలోచించాలంటూ నోరు పారేసుకుంది. ఈ మేరకు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయాన్ని ప్రచురించింది. మాల్దీవులను మేం ఎప్పటికీ సమాన భాగస్వామిగా పరిగణిస్తాం. దాని సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. భారత్, చైనా మధ్య ఘర్షణల కారణంగా దిల్లీకి దూరంగా ఉండాలని మాల్దీవులకు ఎన్నడూ చెప్పలేదు. ఈ ద్వీప దేశానికి భారత్ నుంచి వచ్చే సహకారాన్ని ముప్పుగా భావించలేదు. దక్షిణాసియాలో కొన్ని దేశాలతో ఢిల్లీ సంబంధాలు దెబ్బతిన్నాయి. దానికి చైనాను నిందించడం మాని భారత్ మరింత విశాల దృక్పథంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కథనంలో డ్రాగన్ తన అక్కసు వెళ్లగక్కింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనాలో పర్యటిస్తున్న వేళ ఈ కథనం రావడం గమనార్హం. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ఆయన తన సతీమణితో కలిసి బీజింగ్ చేరుకున్నారు. ఆయనకు డ్రాగన్ అనుకూలమైన వ్యక్తిగా పేరుంది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మొదటి విదేశీ పర్యటన చైనాలోనే చేపట్టారు. గతేడాది సెప్టెంబరులో ముయిజ్జు మాల్దీవుల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. వచ్చీ రాగానే తమ భూభాగంలో ఉన్న భారత బలగాలను తొలగించేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల మోదీపై, లక్షద్వీప్‌పై మాల్దీవులు మంత్రులు విద్వేష వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది. దీన్ని ఢిల్లీ తీవ్రంగా పరిగణించింది.
మరింత దిద్దుబాటలో మాల్దీవులు : ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్‌పై తమ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై మరిన్ని దిద్దుబాటు చర్యలకు మాల్దీవుల ప్రభుత్వం పూనుకుంది. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానివి కావని మరోసారి స్పష్టం చేసింది. మాల్దీవుల విదేశాంగశాఖ ప్రతినిధి అలీ నాజర్ మహమ్మద్‌తో సోమవారం భారత హైకమిషనర్ మును మహావర్ భేటీ అయ్యారు. మంత్రులు, ఎంపీల వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్దేశాలు కావని అలీ నాజర్ వివరించినట్లు అధికారి ఒకరు తెలిపారు. పొరుగు దేశంతో సత్సంబంధాలనే కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేసినట్లు వివరించారు. అంతకుముందు దిల్లీలోని మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహీబ్‌ను విదేశాంగశాఖ పిలిపించింది. మోడీపై మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మోడీ పై, లక్షద్వీప్‌పై విద్వేష వ్యాఖ్యలు చేసిన మంత్రులు ముగ్గురిని ఆదివారం మాల్దీవుల ప్రభుత్వం సస్పెండు చేసిన సంగతి తెలిసిందే.
మాల్దీవులకు విమానాల బుకింగ్‌ను నిలిపేసిన ఈజ్ మైట్రిప్ : భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రైవేటు పర్యాటక సంస్థ ఈజ్ మైట్రిప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి విమానాల బుకింగ్‌ను నిలిపేస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిత్తీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది.
బాయ్‌కాట్ ట్రెండింగ్ వేళ చైనాలో అధ్యక్షుడు : ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించడంపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన వేళ ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనా పర్యటనకు వెళ్లారు. తన సతీమణితో కలిసి ఆదివారం రాత్రి ఆయన పయనమయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ఐదు రోజుల అధికారిక పర్యటన సాగుతోంది. మయిజ్జుకు చైనాకు అనుకూలమైన వ్యక్తిగా పేరుంది. తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా అక్కడికే వెళ్లారు.
లక్షద్వీప్‌కు అమితాబ్ ప్రచారం : లక్షద్వీప్‌లో పర్యాటకానికి తన ప్రోత్సాహం అందిస్తానని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తెలిపారు. లక్షద్వీప్, అండమాన్‌లాంటి మన ప్రాంతాలే అత్యుత్తమం అని కొనియాడారు. ‘మనం ఇండియన్లం. మనం స్వయం సమృద్ధి సాధించాం. మా ఈ స్వీయ అభివృద్ధిని పరీక్షించొద్దు. జైహింద్ (హమ్ భారత్ హై..హమారీ ఆత్మ నిర్భరతా పర్ ఆంచ్ మత్ దాలియే జై హింద్)’ అని అమితాబ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.