నరసన్నపేట ఎప్పుడూ దాసన్నపేటే
శ్రీకాకుళం రాజధాని కావాలానే వారికి విజ్ఞత ఉందా?
విలేకరుల సమావేశంలో ధర్మాన కృష్ణ దాస్
నరసన్నపేట :బాధ్యత గల ప్రతిపక్షం గా ఏనాడూ టీడీపీ వ్యవహరించలేకపోయిందని మాజీ
డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్సిపి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
అన్నారు. భావితరాల కోసం ఆలోచన చేస్తున్న నాయకుడు జగన్ పట్ల అక్కసు, అసూయ
స్పష్టంగా వారిలో కనిపిస్తోందని చెప్పారు. గురువారం మాజీ డిప్యూటీ సీఎం,
వైఎస్ఆర్సిపి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట పార్టీ
కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
* ఒక రిమ్స్, ఒక రూరల్ యూనివర్సిటీ, వంశధార ప్రాజెక్టు, కరకట్టలు,
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం ఇలా ఎన్నో ఆ మహానేత రాజశేఖర్ రెడ్డి చలవతో
వెనకబడిన శ్రీకాకుళం జిల్లాకు వచ్చాయి.వైయస్ జగన్ లాంటి దార్శినికుని ఆలోచనలతో
ఉద్దానం మంచినీటి పథకం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఒక భావన పాడు పోర్టు లాంటి
జిల్లా గతిని మార్చే ప్రాజెక్టులు రాబోతున్నాయి. నరసన్నపేట ప్రజలు మాపై
విశ్వాసం ఉంచారు గనకనే జిల్లాలోనే అత్యధిక మెజారిటీ నాకు వచ్చింది. సర్పంచ్
ఎన్నికల్లో నరసన్నపేట మేజర్ పంచాయతీ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీల జాబితాలో
నిలిచింది. మీరు మీ హయాంలో ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే పని ఇది చేశామని
చెప్పుకునే నిర్మాణం ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. మీరు రాళ్ళు పాతి
వదిలేసారు. మేము వాటిని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకున్నాము. ఉత్తర
ప్రగల్భాలు ఆపండి. పది రూపాయల కొబ్బరికాయ కొట్టి చంకల గుద్దుకునే రకాలు మీరు.
ఉత్తరాంధ్ర రాజధానిని స్వాగతించి తద్వారా మన ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని
మేము చూస్తుంటే, వాటిని అడ్డుకోవాలని మీరు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు.
మీకు స్పష్టమైన ఆలోచన లేదని తెలిపారు.
విశాఖ రాజధాని చేయమంటే స్థానిక ఎంపీ శ్రీకాకుళం రాజధాని కావాలంటున్నాడు.
నిమ్మాడ వద్దా? ఎర్రన్నాయుడి కొడుకుగా మీరు ప్రజా ప్రయోజనం కోసం ఇలాగే
మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం కాదు
నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. ఇప్పుడు మేము ఆర్థికంగా, సామాజికంగా
నిలదొక్కుకోవాలని చూస్తుంటే మీరు తొక్కేయాలని చూస్తున్నారు. నిన్న
ముఖ్యమంత్రి నరసన్నపేటకు వరాల జల్లు కురిపించారు. మేము ఏమి అడిగినా సరే
ముఖ్యమంత్రి దాన్ని కాదనలేదు. ఆయనకు నరసన్నపేట ప్రజలు ఎంతో రుణపడి ఉంటాం. సీఎం
పర్యటనలో నరసన్నపేట అష్ట దిగ్బంధనం చేశామని, బలవంతంగా షాపులు మూసామని రాజకీయం
చేయాలని చూశారు. కానీ ప్రజలు వాస్తవాలు గుర్తించారని అన్నారు.