దెబ్బకు దెబ్బతీస్తామంటూ హెచ్చరిక
కీవ్: రష్యా వెన్నులో వణుకు పుట్టించే ఘటన తెల్లవారుజామున చోటుచేసుకుంది.
రెండు డ్రోన్లు ఏకంగా మాస్కో గగనతలంలోకే చొచ్చుకొచ్చాయి. ఓ డ్రోన్ రష్యా
రక్షణమంత్రిత్వశాఖ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా దూసుకొచ్చింది. కార్యాలయానికి
కేవలం 200 మీటర్ల దూరంలో దాన్ని జామర్లతో రష్యా కూల్చివేసింది. మరో డ్రోన్..
ఎత్తైన ఓ ప్రభుత్వ భవనం పైరెండంతస్తులకు తీవ్రనష్టం కలిగించింది. ఈ రెండు
ఘటనల్లో ఎవరికీ గాయాలు కాలేదని రష్యా తెలిపింది. మరోవైపు క్రిమియాలో ఆయుధ
డిపోపైనా డ్రోన్లు దాడి చేశాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో ప్రజలను అధికారులు
ఖాళీ చేయించారు. ఈ డ్రోన్ల దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా పేర్కొంది.
మరోవైపు దక్షిణ ఉక్రెయిన్లోని నల్లసముద్రతీర పట్టణాలపై మాస్కో దాడులు
సోమవారమూ కొనసాగాయి. ముఖ్యంగా డాన్యూబ్ నది పక్కన ఉన్న ఓడరేవులను లక్ష్యంగా
చేసుకొని క్షిపణులను ప్రయోగించింది. ధాన్య ఒప్పందం నుంచి వైదొలగినప్పటి నుంచి
రష్యా ఉక్రెయిన్ నౌకాశ్రయాలపై గురి పెట్టిన సంగతి తెలిసిందే.
ఉక్రెయిన్ చేతిలోకి 50% భూభాగం : రష్యా ఆక్రమించిన సగం భూభాగాన్ని ఉక్రెయిన్
తిరిగి సొంతం చేసుకున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్
వెల్లడించారు. ‘‘ఉక్రెయిన్ నుంచి రష్యా ఇప్పటి వరకు ఆక్రమించిన సగం
భూభాగాన్ని విడిపించుకోగలిగింది. ఆ భూభాగాన్ని తిరిగి దక్కించుకునేందుకు
ఉక్రెయిన్ ఎంతో శ్రమించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ ఎదురుదాడి ఇలానే
కొనసాగుతుంది. ఇది రోజులు, వారాల్లో ముగిసేది కాదు. చాలా నెలల పాటు
కొనసాగవచ్చని అన్నారు.