న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మన్మోహన్ సింగ్ సేవలను గుర్తించిన గడ్కరీని మాస్టర్ చెఫ్‌గా అభివర్ణించింది. కొద్దిరోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థను తెరవలేదని విమర్శించారు. అవి సగం వండినట్లు అసంపూర్తిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ వచ్చాకే మౌలిక సదుపాయాలు, రహదారుల అభివృద్ధి జరిగిందని చెప్పారు. మళ్లీ నరేంద్ర మోదీ హయాంలోనే.. అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. దీనిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ట్విటర్లో స్పందించింది. ‘సగం వండిన అనే పదంవాడి 1991 నాటి సంస్కరణలను నిర్మలా సీతారామన్ తక్కువచేసి మాట్లాడారు. కానీ మన్మోహన్ సింగ్ సేవలకు తగిన ప్రశంసలు అర్పించి మాస్టర్ చెఫ్ నితిన్ గడ్కరీ వాటిని (సంస్కరణలు) బాగా వండారు. ఆమె ఇప్పుడు బాగా అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నానని వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక మంత్రి హోదాలో మన్మోహన్సింగ్ చేపట్టిన సంస్కరణలు భారత్‌కు కొత్త మార్గాన్ని చూపెట్టాయని గడ్కరీ కొనియాడారు. ఆ సమయంలో తాను మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నానని, సంస్కరణల వల్లే రోడ్ల నిర్మాణానికి భారీ ఎత్తున నిధుల్ని సమీకరించగలిగానని గుర్తుచేసుకున్నారు.