మంగళగిరి : ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన క్రికెటర్ అంబటి రాయుడు బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. సమావేశం వివరాలను ఎక్స్ (ఇంతకు ముందు ట్విటర్) ద్వారా రాయుడు వెల్లడించారు. ‘‘స్వచ్ఛమైన మనసు, ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. నా ఆలోచనలు, కలలు సాకారమవుతాయని వైసీపీలో చేరా. క్షేత్రస్థాయిలో అనేక గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నా. వ్యక్తిగతంగా సాధ్యమైనంత మేరకు సాయం చేశా. కొన్ని కారణాల వల్ల వైసీపీతో కలసి ముందుకెళ్తే నేను అనుకున్న లక్ష్యాలను సాధించలేనని అర్థమైంది. ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టడం లేదు. నా ఆలోచన, వైకాపా ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. ఎన్నికల్లో ఫలానా స్థానం నుంచి పోటీ చేయాలని అనుకోలేదు. ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నా. అయితే.. నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి పవన్ అన్నను కలవమని నా స్నేహితులు, శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. ఆయన సిద్ధాంతాల గురించి తెలుసుకోమన్నారు. అందుకే పవన్‌ను కలసి మాట్లాడా. జీవితం, రాజకీయాలతో పాటు ఆయన్న అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించా. మా ఇద్దరి ఆలోచనల్లో సారూప్యత కనిపించింది. ఆయన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ కోసం త్వరలోనే దుబాయ్ వెళ్తున్నా. నేను ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటానని పోస్ట్ చేశారు.