రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
మాస్కో : వాగ్నర్ గ్రూప్ ప్రైవేట్ కిరాయి సైనికులకు ఒకే యూనిట్‌గా
సేవలందించేందుకు అవకాశం ఇచి్చనట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
చెప్పారు. ఇప్పటి వరకు పనిచేసిన విధంగానే అదే కమాండర్ ఆధ్వర్యంలో వారు
కార్యకలాపాలు సాగించవచ్చన్నారు. అదే విధంగా, తమ దేశంలో ప్రైవేట్ ఆర్మీ లేదని,
అటువంటి వాటికి చట్టబద్ధత లేదని స్పష్టం చేశారు. పుతిన్ 23 ఏళ్ల పాలనలో
ఎన్నడూ లేని విధంగా గత నెలలో వాగ్నర్ గ్రూప్ సైనికుల తిరుగుబాటుయత్నం,
బెలారస్ అధ్యక్షుడు లుకశెంకో మధ్యవర్తిత్వంతో 24 గంటల్లోనే సద్దుమణగడం
తెలిసిందే. ఆ తర్వాత అయిదు రోజులకు జూన్ 29న వాగ్నర్ గ్రూప్ చీఫ్
ప్రిగోజిన్ సహా అందులోని 35 మంది కమాండర్లతో సమావేశమైనట్లు పుతిన్ తాజాగా
కొమ్మెర్‌శాంట్ పత్రికకు ఇచ్చ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తిరుగుబాటుయత్నం
కారణాలు, పరిస్థితులపై చర్చించానన్నారు. భవిష్యత్తులో పనిచేసేందుకు గల పలు
అవకాశాలను వారి ముందుంచినట్లు వెల్లడించారు. ఇప్పటి మాదిరిగానే గ్రే హెయిర్
అనే కమాండర్ ఆధీనంలో పనిచేయడం అందులో ఒకటన్నారు. ఎటువంటి మార్పులు ఉండవని,
గ్రూప్‌లోని అందరూ అందులో యథావిధిగా కొనసాగవచ్చని చెప్పానన్నారు. చాలా మంది
కమాండర్లు ఈ ఆఫర్‌కు మొగ్గు చూపారన్నారు.
అయితే, సమావేశం ముందు వరుసలో కూర్చున్న వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్
మాత్రం తమ వాళ్లకు ఇది నచ్చలేదని చెప్పారన్నారు. అయితే చివరికి వాగ్నర్
గ్రూప్ ఈ ఆఫర్‌కు అంగీకరించిందీ లేనిదీ పుతిన్ స్పష్టం చేయకపోవడం గమనార్హం.
వాగ్నర్ గ్రూప్‌కు ఎలాంటి చట్టబద్ధత లేదని ఈ సందర్భంగా పుతిన్ పేర్కొన్నారు.
‘ప్రైవేట్ మిలటరీ సంస్థలకు సంబంధించి దేశంలో ఎలాంటి చట్టాలు లేవు. కాబట్టి,
రష్యాలో ప్రైవేట్ ఆర్మీ లేదు. ప్రైవేట్ మిలటరీ కాంట్రాక్టర్ల విషయమై
ప్రభుత్వం, పార్లమెంట్ చర్చించాల్సి ఉంది’అని పుతిన్ వివరించారు. వాగ్నర్
గ్రూప్ కిరాయి సైనికులు రష్యా రక్షణ శాఖతో ఒప్పందానికి రావడం లేదా
పొరుగునున్న బెలారస్‌కు వెళ్లిపోవడం, రిటైర్ కావడం వంటి అవకాశాలను ఇచ్చినట్లు
గతంలో పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా వాగ్నర్ గ్రూప్‌నకు
చెందిన కొందరు సభ్యులు బెలారస్లో తమ కార్యకలాపాలు ప్రారంభించినట్లు
చెబుతున్నారు.