సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మిస్టర్ 360కి పెట్టింది పేరు. అతను బ్యాటింగ్ చేస్తుంటే.. గ్రౌండ్‌కు నలుమూలలా షాట్లు కొడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. అందుకే అతన్ని మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అని అభివర్ణిస్తారు. కానీ సూర్యకుమార్ ఇవాళ ఏబీ డివిలియర్స్నే తలదన్నేలా కనిపిస్తున్నాడు. గ్రౌండ్ నలువైపులా షాట్లు కొడుతూ మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అనే పేరును సార్థకం చేసుకున్నట్లగానే అనిపిస్తుంది. అందరూ ఊహించినట్లే టి20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు తురుపుముక్క అయ్యాడు. అసలే కోహ్లి భీకరమైన ఫామ్‌లో ఉండడం సానుకూలాంశమనుకుంటే అగ్నికి వాయువు తోడైనట్లు సూర్యకుమార్ తన కెరీర్లోనే ఉన్నత ఫామ్‌ను కనబరుస్తూ ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఈసారి సూర్యకుమార్ టీమిండియాకు టి20 ప్రపంచకప్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది.