విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 38 లో నిబంధనలు
కఠినతరంగా ఉన్నాయని, మీడియా ఆక్రిటేషన్ జారీలో ఐటీ రిటర్న్స్ నిబంధన విధించడం
వల్ల 90 శాతం కు పైగా పత్రికలు తమ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని వెంటనే ఆ
నిబంధనలు తొలగించాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ డిమాండ్
చేసింది. ఈ మేరకు ఏపీ ఎంపీఏ నాయకులు సోమవారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ
కమిషనర్ విజయకుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. జీవో నెంబర్ 38 లో రెండు
సంవత్సరాల ఐటీ రిటర్న్స్ ఇవ్వాలని నిబంధన చిన్న, మధ్యస్థ పత్రికలకు శరాఘాతంగా
మారిందని, ముందస్తు సమాచారం లేనందున ఇప్పటికిప్పుడు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం
సాధ్యం కాదని ఈ నిబంధన ఎత్తివేయాలని వారు కోరారు. జిల్లాల పునర్విభజన
పూర్తిస్థాయిలో జరగనీ కారణంగా పత్రికలు తమ ఎడిషన్ ఏర్పాటు చేసుకోలేదని కావున
అక్రిడిటేషన్ విషయంలో ఉమ్మడి జిల్లాను స్థానికతగా ప్రామాణికంగా తీసుకోవాలని
కోరారు. మీడియం పత్రికలకు మండలానికి ఒకటి చొప్పున, రెగ్యులారిటీ ఉన్న
చిన్నపత్రికలకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున అక్రిడిటేషన్ మంజూరు
చేయాలని కోరారు. అంతేకాక కఠిన తరంగా ఉన్న మరికొన్ని నిబంధనలను సరళతరం చేసి
చిన్న మీడియం దినపత్రికల అభివృద్ధికి సహకరించవలసిందిగా వారు
తెలిపారు.అక్రిడిటేషన్ నూతన కమిటీ ఏర్పాటు, అక్రిడిటేషన్ ఆన్ లైన్ ప్రక్రియ,
మంజూరు సమయం పడుతుంది కాబట్టి అప్పటివరకు అక్రిడిటేషన్,బస్ పాస్ లు హెల్త్
కార్డులను తక్షణమే పొడిగించాల్సిందిగా వారు కమిషనర్ ను కోరారు. సమాచార శాఖ
కమిషనర్ ని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర
అధ్యక్షుడు వీర్ల శ్రీ రామ్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి యేమినేని వెంకట రమణ,
నగర అధ్యక్షుడు తాళ్లూరి అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి గుర్రం
శ్రీనివాసరావు, ఏపీఎంపీఏ నాయకులు అవినిగడ్డ సురేష్ కుమార్, కోటేశ్వరరావు,
నాగోతి శ్రీనివాసరావు, దుర్గాసి సాయి,పిల్లా ఆనంద్ తదితర నేతలు ఉన్నారు.