150 కిలోమీటర్ల వేగంతో గాలులు
7,500 మంది ఇప్పటికే తరలింపు
అప్రమత్తతపై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష
అహ్మదాబాద్ : బిపోర్ జాయ్ తుపాను ముంచుకొస్తోంది. అతి తీవ్రమైన ఈ తుపాను
గురువారం మధ్యాహ్నం గుజరాత్లోని కచ్ జిల్లా జఖౌవద్ద తీరాన్ని తాకనుంది. ఆ
సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ సోమవారం
వెల్లడించింది. మరోవైపు అప్రమత్తతపై దిల్లీలో ప్రధాని మోదీ సమీక్ష
నిర్వహించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గుజరాత్ తీరంలోని కచ్, పోర్బందర్, దేవభూమి ద్వారక, జాంనగర్, జునాగఢ్,
మోర్బి జిల్లాల్లో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కచ్ తీరానికి
ఐఎండీ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. సముద్రానికి దగ్గరగా ఉన్న వారిని ఖాళీ
చేయిస్తోంది. 7,500 మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మంగళవారం
నుంచి సముద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని తరలించేందుకు ఏర్పాట్లు
చేస్తోంది. చేపల వేటను నిషేధించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
రంగంలోకి దిగాయి. సైన్యం, నౌకా, కోస్టుగార్డు దళాలతో ఎటువంటి పరిస్థితినైనా
ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధంగా ఉన్నారు. సౌరాష్ట్ర, కచ్లలో భారీ
వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. సోమవారం తీర ప్రాంతాల్లోని
కొన్ని జిల్లాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. కచ్ జిల్లాలో అధికారులు 144
సెక్షన్ను విధించారు. 15వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
*ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష : కేంద్ర హోంశాఖ 24 గంటలూ తుపాను పరిస్థితిని
సమీక్షిస్తోందని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. 12 ఎన్డీఆర్ఎఫ్
బృందాలు రంగంలోకి దిగాయని, మరో 15 స్టాండ్బైలో ఉన్నాయని వివరించింది.
తుపానుపై దిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.
అధికారుల సన్నద్ధతపై ఆయన సమీక్షించారు. సమీక్ష సమావేశానికి అమిత్ షాతోపాటు
ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ముంబయికీ వర్షాల ముప్పు : దేశ వాణిజ్య రాజధాని ముంబయికీ వర్షాల ముప్పు పొంచి
ఉంది. అక్కడ ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. బలమైన గాలుల కారణంగా ముంబయి
ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. గాలుల తీవ్రతతో కొన్ని
విమానాలను రద్దు చేయగా చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని
విమానాలను దింపే పరిస్థితి లేక మరో ఎయిర్పోర్టుకు మళ్లిస్తున్నారు. దీంతో
ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుపాను ప్రభావంతో గురు,
శుక్రవారాల్లో దిల్లీ, రాజస్థాన్, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో
వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. మరోవైపు పాకిస్థాన్
తుపాను సహాయక చర్యలు చేపట్టింది. సింధ్ రాష్ట్రంలోని దక్షిణ తీరంలో ఉన్న
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది.