కసరత్తు చేస్తున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. గతంలో ఆయన
ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఈ దఫా కూడా అలాంటి వ్యూహంతోనే
ముందుకెళుతారనే ప్రచారానికి బలం కలుగుతోంది. ఇందుకు ఈ నెల 15న కేసీఆర్
అధ్యక్షతన టీఆర్ఎస్ లెజిస్లేటివ్, అలాగే పార్లమెంటరీ పార్టీ సమావేశం
నిర్వహిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఉప
ఎన్నికలో పాజిటివ్ ఫలితం రావడం, మరోవైపు ప్రధాని మోదీ నేతృత్వంలోని
కేంద్ర ప్రభుత్వం కయ్యానికి కాలు దువ్వుతుండడంతో తాడోపేడో తేల్చుకోవాలనే
పట్టుదలతో కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్
లెజిస్లేటివ్, పార్లమెంటరీ సభ్యులతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో
సంయుక్త సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకోనున్నారనే ప్రచారం
ఊపందుకుంది.
ఈ సమావేశం మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరగనుంది. టీఆర్ఎస్ను
బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా తీర్చిదిద్దిన నేపథ్యంలో మొదట తెలంగాణలో
బలాన్ని నిరూపించుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిసింది. తెలంగాణ
అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగాల్సి వుంది. ఇప్పుడు ముందస్తు
ఎన్నికలకు వెళ్లినా పది నెలలు నిర్ణీత కాలం కంటే ముందుగా ఎన్నికలు జరిగే
అవకాశం ఉంది. ఇప్పటికప్పుడు కీలక సమావేశం నిర్వహించాల్సిన అవసరం
లేదనే వాదన వినిపిస్తోంది. ఎంతో కీలకమైన అంశంపై చర్చించే నిమిత్తం
కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తున్నారనే అభిప్రాయాలు
వ్యక్తమవుతున్నాయి.
క్షేత్రస్థాయిలో పలు సర్వేలను ఎప్పటికప్పుడు కేసీఆర్ చేయించుకుంటూ, వాటి
ఫలితాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. అలాగే
జ్యోతిష్యాన్ని ఆయన బలంగా నమ్ముతారు. ఆ కోణంలో కూడా ఫలానా సమయంలో
ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం దక్కుతుందనే లెక్కలుంటే కేసీఆర్ వెనుకంజ
వేయరనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మరో రెండు రోజుల్లో టీఆర్ఎస్
కీలక సమావేశంపై అనేక రకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అసలే కేసీఆర్
సంచలన నిర్ణయాలకు మారుపేరు. ఆయన మదిలో ఏముందో తెలియాలంటే మంగళవారం
వరకూ వేచి చూడాల్సిందే.